అమ్మో ఒకటో తారీఖు

అమ్మో ఒకటో తారీఖు


ఉద్యోగ, ఉపాధ్యాయులు:40

అవుట్‌సోర్సింగ్  : 12 వేల మంది

పెన్షనర్లు    : 25 వేల మంది

రోజూ ట్రెజరీ లావాదేవీలు  4 కోట్లు (రూ)


 

నిలిచిన రోజువారీ చెల్లింపులు 

జనవరి జీతభత్యాల చెల్లింపులు డౌటే 

పింఛన్‌దారుల్లోనూ టెన్షన్..టెన్షన్ 

ప్రభుత్వానికి ముందుచూపు లేకనే ఈ దుస్థితి




ముందుచూపులేని ప్రభుత్వతీరు ఉద్యోగులకు..పింఛన్‌దారులకు శాపంగా మారింది. ఆర్థికలోటు సాకుతో ట్రెజరీకి తాళాలువేయడంతో రోజువారీ జరిగే కోట్లాది రూపాయల లావాదేవీలకు బ్రేకులు పడ్డాయి. జనవరి జీతభత్యాలు, పింఛన్ చెల్లింపులపై కూడా ఈ ప్రభావం పడనుందనే సంకేతాలందుతుండటంతో ఉద్యోగులు, పింఛన్‌దారుల్లో ఆందోళన రోజురోజుకు రెట్టింపవు తోంది.

 

విశాఖపట్నం :విభజన కష్టాలు మొదలయ్యాయి. లోటుబడ్జెట్‌కు తోడు ప్రభుత్వం చేస్తున్న వృథా ఖర్చులు ఖజానాకు భారంగా మారాయి. లోటును పూడ్చుకోవడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడంలో విఫలమైన ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ట్రెజరీ ద్వారా జరిపే చెల్లింపులను నిలుపుదల చేస్తూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలోనే ట్రెజరీ ద్వారా వివిధ శాఖల రోజు వారీ ఖర్చులతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం నాలుగు కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతుంటాయి. వీటిని పూర్తిగా నిలిపివేయడంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. ఇప్పటికే చెల్లింపుల కోసం బ్యాంకులకు పంపిన లిస్ట్‌లు సైతం పాస్ కాకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో లాక్ చేసింది. రెండు మూడురోజులుగా ట్రెజరీనుంచి బ్యాంకులకు వెళ్లిన బిల్లులకు సంబంధించి సుమారు రూ.10కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయాయి. బుధవారం నుంచి రోజువారీ చెల్లింపులకు సైతం బ్రేకులు పడ్డాయి. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, పింఛన్‌దారుడు చనిపోతే వారు నెలకు డ్రా చేసే బేసిక్ పే లేదా పింఛన్ మొత్తాన్ని వెంటనే మంజూరు చేస్తారు. ట్రెజరీ ద్వారా చెల్లింపులు నిలిపివేస్తూ ఎప్పుడు ఆదేశాలు జారీ చేసినా వీటికి మినహాయింపు ఉండేది. ఇప్పుడు వీటి చెల్లింపులను సైతం నిలుపుదలచేయడం విస్మయానికి గురిచేస్తోంది. మరొక పక్క జీతభత్యాలు, పింఛన్‌చెల్లింపుల బిల్లుల పెట్టాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు 40వేలమంది ఉండగా, 12వేల మంది వరకు అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు.సుమారు 25వేల మంది పింఛన్‌దారులున్నారు. జీతభత్యాల రూపంలో ఉద్యోగులకు రూ.110కోట్లు, అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందికి రూ.10కోట్లు చెల్లిస్తుండగా, పింఛన్‌దారులకు రూ.50కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి.



గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన చెల్లింపులకు విభజన నిష్పత్తి ప్రకారం ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంలో జాప్యం వల్ల జనవరిలో సంక్రాంతి వరకు జీతభత్యాలందలేదు. ఇప్పుడు జీతాలు అందుతాయో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అధికారులు, ఉద్యోగులతో పాటు పింఛన్‌దారుల్లో కూడా ఫిబ్రవరి-1టెన్షన్ మొదలైంది.నాలుగు నెలలుగా ఎప్పుడందుతాయో లేదో కూడా తెలియక ఇబ్బందిపడుతున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పించన్‌దారులకు సైతం ఫిబ్రవరిలో పింఛన్ చెల్లింపులు డౌటేనని అధికారులే చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నప్పుడు జిల్లాకు కోటి చొప్పున ఖర్చు చేసి సంక్రాంతి సంబరాలు చేయడం ఎందుకు చేశారని,చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట రూ. 270 కోట్లకు పైగా ఖర్చు చేసి ఉచిత సరుకులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top