తిరుప్పావడ సేవలో గవర్నర్ దంపతులు

తిరుప్పావడ సేవలో గవర్నర్ దంపతులు - Sakshi


సాక్షి, తిరుమల: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. పుష్కరిణి నీటిని ప్రోక్షణం చేసుకున్నారు. తర్వాత ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వర స్వామి, వకుళమాతను దర్శించుకుని హుం డీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ గవర్నర్ దంపతులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.



కాన్వాయ్‌లో ఆగిన గవర్నర్ కారు.. మరో కారులో ప్రయాణం

తిరుమల పర్యటనలో గురువారం ఉదయం గవర్నర్ కారు మధ్యలో ఆగింది. అతిథి గృహం నుంచి ఆలయానికి వెళ్లే సమయంలో రాంబగీచా వద్ద కారులో హఠాత్తుగా వాసన రావడంతో పాటు ముందుకు కదలలేదు. దీంతో గవర్నర్ నరసింహన్ దంపతులు కాన్వాయ్‌లో వెనుకే వస్తున్న మరో కారులో ఆలయం వద్దకు చేరుకున్నారు. హ్యాండ్ బ్రేక్‌ను డ్రైవర్ రిలీజ్ చేయకుండానే కారు నడపడంతో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసు దర్యాప్తునకు ఆదేశించినట్టు సమాచారం.



చక్రస్నానంలో..

తిరుచానూరు: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం పుష్కరిణిలో నిర్వహించిన చక్రస్నానానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. పంచమీతీర్థం మండపంలో అమ్మవారు, చక్రతాళ్వార్లకు నిర్వహించిన స్నపన తిరుమంజనంను తిలకించారు. అనంతరం పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

 

అమ్మవారికి శ్రీవారి సారె

సాక్షి, తిరుమల/తిరుచానూరు: తన పట్టపురాణి అయిన పద్మావతి అమ్మవారికి వేంకటేశ్వర స్వామివారు సారె పంపారు. గురువారం తిరుమలలో ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించటం సంప్రదాయం. ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పుష్పాలు, తులసిమాల, నూతన వస్త్రాలు, ఇతర ఆభరణాలతో కూడిన సారెను టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, డెప్యూటీఈవో చిన్నంగారి రమణ మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిం చారు. కార్యక్రమంలో జీయరు స్వాము లు, అర్చకులు, డాలర్ శేషాద్రి పాల్గొన్నారు.



తిరుపతిలోని శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్న సారెను టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్‌కు అందజేశారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు నడు మ ఏనుగు అంబారిపై సారెను ఊరేగింపుగా కోమలమ్మ సత్రం, కోదండరామస్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరుచానూరు పసుపు మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత తిరువీధుల్లో ఊరేగింపుగా ఆలయం మీదుగా పంచమీతీర్థ మండపానికి తీసుకొచ్చి ఆలయ అర్చకులకు అప్పగించారు.



వేడుకగా స్నపన తిరుమంజనం

పద్మావతి అమ్మవారి చక్రస్నానం పురస్కరించుకుని గురువారం పుష్కరిణిలోని పంచమీతీర్థం మండపంలో అమ్మవారికి, చక్రతాళ్వార్లకు ఆలయ అర్చకులు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల నుంచి అమ్మవారికి శ్రీవారి సారె వచ్చిన తరువాత 10.30 గంటలకు పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పచ్చల హారాన్ని అలంకరించారు. జియ్యర్ స్వాముల సమక్షంలో పాంచరాత్ర ఆగమ పండితులు మణికంఠభట్టర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రతాళ్వార్లకు చక్రస్నానం వేడుకగా నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top