తీరని ‘టెన్’షన్

తీరని ‘టెన్’షన్

  •  పదో తరగతి పరీక్షలపై స్పష్టతలేని  సర్కారు

  • చోడవరం రూరల్: ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులతో చెలగాటమాడుతోందనే చెప్పాలి. ఈ ఏడాది సిలబస్ మార్చారు. సీబీఎస్‌ఈ  తరహాలో పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ నూతన విధానం అమల్లోకి వచ్చింది. సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం) పద్ధతి అంటూ పుస్తకాలలో సమాచారం ఇచ్చారు.



    విద్యార్థులు సాధించాల్సిన ప్రమాణాలను కూడా ఆయా సబ్జెక్టుల వారీగా పుస్తకాలలోనే పొందుపరిచారు. ఉపాధ్యాయులకు సీసీఈపై అవగాహన కల్పించే తరగతులు కూడా నిర్వహించారు. గడచిన రెండేళ్లలో 6, 7 తరగతులకు ఒకసారి, 8, 9 తరగతులకు గత ఏడాది నూతన్ సిలబస్ రూపొందించారు. ఈ ఏడాది 10వ తరగతి సిలబస్ మార్చారు.



    రెండేళ్ల నాటి ఎల్‌ఈపీ స్థానంలో సీసీఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బట్టీ చదువులు కాకుండా విద్యార్థుల్లో స్వీయ రచన, ఆలోచన, బహిరంగ పర్చడం, చర్చించడం, ప్రాజెక్టు పని వంటి ప్రామాణిక అంశాల్లో నైపుణ్యం వచ్చేలా పుస్తకాలలో అంశాలు పొందుపరిచారు. ఈ పద్ధతిలోనే వార్షిక పరీక్షలు జరుగుతాయని గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా రెండు నెలలుగా ఈ విధానంలోనే బోధన, విద్యార్థులకు ప్రాజెక్టు పనులు పాఠశాలలో చేయిస్తున్నారు.



    సిలబస్ కూడా పాత పరీక్ష విధానంతో ఏ మాత్రం పోలిక లేదు. ఈ పరిస్థితుల్లో పాత విధానంలోనే పరీక్షలన్న వార్తలు తల్లిదండ్రులు, విద్యార్థల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.  ఏమి చదవాలో, ఏ విధంగా చదవాలో అర్థంకాని సందిగ్ధ పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న అంశమే. వాస్తవానికి పాతపద్ధతిలో పరీక్షలు నిర్వహించడమంటే గతంలో మాదిరి 11 పేపర్లు నిర్వహించడంతోబాటు, పాత నమూనాలోనే 100 మార్కులకు పేపర్ ఉండాలి.



    ఇలాగే ఉంటుందా లేక నూతన సిలబస్ ఆధారంగా నమూనా మారుతుందా అన్న విషయం స్పష్టం కాలేదు. ప్రస్తుత సిలబస్ పాత నమూనాకు అనుగుణంగా లేదు. నూతన సిలబస్‌లో  ప్రశ్నలకు  విద్యార్థి ఆలోచనలకు తగ్గట్టుగా సమాధానాలు రాసే విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఏ పద్ధతిలో పరీక్షలు సిద్ధం కావాలన్నదే పెద్ద పరీక్షగా మారింది.  ప్రభుత్వం ఇకనైనా పదో తరగతి  పరీక్షల నిర్వహణ విషయంలో స్పష్టంగా ప్రకటన చేయడం, నమూనా పరీక్ష పేపర్   విడుదల చేయడం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలి.

     

    పాతపద్ధతిలోనే పరీక్షలు

    పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలో 11 పేపర్లు ఉంటాయి. పాత విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ పేపర్ విషయంలో నెట్ ద్వారా ఉపాధ్యాయుల నుంచి సూచనలు నేరుగా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ సమాచారం  ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. పేపర్ విధానం ఎలా ఉంటుందన్నది ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉంది.

     - కృష్ణారెడ్డి, డీఈఓ

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top