సర్కారుకు షాక్


  • రాజధాని ప్రాంతంలో లే-అవుట్లు, డెవలప్‌మెంట్లకు అనుమతివ్వొద్దన్న ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టిన హైకోర్టు

  • సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారయ్యేంతవరకు విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి లే-అవుట్లు, గ్రూప్ డెవలప్‌మెంట్ తదితరాలకు అనుమతులు ఇవ్వొద్దన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలను ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఇంకా తయారుకాని మాస్టర్ ప్లాన్‌ను కారణంగా చూపి ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఏపీ సర్కార్ ఆదేశాల అమలును నిలుపుదల చేసింది.



    ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం రాసిన లేఖ చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లేఖ విషయంలో ప్రభుత్వం చట్ట పరిధిని దాటి వ్యవహరించిందని వ్యాఖ్యానించారు.



    విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎంయూడీఏ) పరిధిలో ఎటువంటి లేఅవుట్లు, గ్రూప్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని వీజీటీఎంయూడీఏ వైస్ చైర్మన్, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్లను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి ఈ ఏడాది సెప్టెంబర్ 17న లేఖ రాశారు. దీనిని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కుమారుడు శ్రీ చైతన్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



    ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. కృష్ణా జిల్లా, నూజివీడు మండలం, సుంకొల్లు గ్రామ పరిధిలో నివాస లేఅవుట్ అభివృద్ధి కోసం తాము పెట్టుకున్న దరఖాస్తును వీటీజీఎంయూడీఏ అధికారులు పెండింగ్‌లో ఉంచారని, ఇది ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి చట్ట నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తెలిపారు. ఇందుకు సెప్టెంబర్ 17న రాసిన లేఖను కారణంగా చూపారన్నారు.



    అసలు ఈ లేఖ కూడా పట్టణాభివృద్ధి చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. నూజివీడు ప్రాంతం మాస్టర్ ప్లాన్‌లో ఇప్పటివరకు భాగం కాలేదన్నారు. అయినా కూడా నూజివీడు ప్రాంతంలో లేఅవుట్ల అభివృద్ధికి అనుమతులు ఇవ్వడంలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.



    వాదనలు విన్న న్యాయమూర్తి, వీజీటీఎంయూడీఏ వైస్ చైర్మన్‌కు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను తప్పుపడుతూ దాని అమలును నిలుపుదల చేశారు. ప్రతివాదులుగా ఉన్న పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, వీజీటీఎంయూడీఏ వైస్ చైర్మన్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top