పండుటాకులపై సర్కారు వేటు


సాక్షి, ఒంగోలు: ఆసరా లేని పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు సిద్ధమైంది. అర్హతల పరిశీలనల పేరుతో ఁనయ వంచన*కు ప్రభుత్వం తెరదీసింది. ప్రత్యేక కమిటీలంటూనే.. అందులో రాజకీయ నేతలను సభ్యులుగా చేర్చుతూ ఉత్తర్వులు  జారీచేసింది. వచ్చేనెల (అక్టోబర్) రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే పింఛన్ల వారోత్సవాల్లో భాగంగా ముందస్తు చర్యలంటూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 135ను జారీచేసింది.



 పింఛన్ తీసుకుంటున్న వారి అర్హతల పరిశీలనతోపాటు ఆధార్‌కార్డుల సీడింగ్ ప్రక్రియ వివరాలతో సరిపోల్చేందుకు ఇంటింటికీ ప్రత్యేక కమిటీలను పంపనుంది. అసలే చాలీచాలని పింఛన్‌తో కష్టంగా నడుస్తున్న రోజుల్లోనే ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వృద్ధులు, వికలాంగులకు పింఛన్‌లు పెంచి ఆదుకున్నారు. ‘వంద’రోజుల కిందట అధికారంలోకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారి నోటికాడ ముద్దను లాగేసుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. సమగ్ర సర్వే పేరిట పింఛన్‌దారులపై రాజకీయ పెత్తనానికి ఒడిగడుతోంది.



 ఆర్థికపొదుపు పేరిట బహిరంగ ప్రకటనలిస్తూనే.. అనవసర వ్యవహారాలకు ఇష్టానుసారంగా ఖర్చుచేస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం అభాగ్యుల మెడపై కత్తిదూస్తోంది. పాతబడ్జెట్ ప్రకారమే పింఛన్‌దారులకు అధికమొత్తాన్ని పంపిణీ చేయాలంటే... అందులో కొందరిని అనర్హులుగా ప్రకటించాలనే ఎత్తుగడకు అధికార పార్టీ నేతలు పూనుకుంటున్నారు. టీడీపీ వాగ్థానాల్లో భాగంగా పెంచుతామన్న పింఛన్లను అక్టోబర్ రెండో తేదీ నుంచి పంపిణీ చేయాలనే తలంపుతో కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19, 20వ తేదీల్లో ఓ సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వ ఆదేశాలు బుధవారమే జిల్లాకేంద్రానికి అందాయి.



అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్థిదారుల ఇళ్లకు రానున్నారు. ఇప్పటికే డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి సేకరించిన లబ్ధిదారుల జాబితాలో పేర్కొన్న వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో సంబంధిత లబ్థిదారులు కనిపించకపోతే అక్కడిక్కడే అనర్హత వేటు వేయాలనేది జీవో సారాంశం. అంటే, ఈ పథకం ద్వారా తమ అనుయాయులకే లబ్ధిచేకూరేలా మలుచుకునేందుకు .. బినామీల ఏరివేత పేరిట జల్లెడ పడుతున్నారు.



 ఏరి వేత ఇలా...: గ్రామాలవారీగా సర్వే బృందాల ఏర్పాటుకు నిర్ణయించారు. సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, పంచాయతీ కార్యదర్శితోపాటు ఇద్దరు సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులతో గ్రామస్థాయిలో కమిటీలను నియమించాల్సి ఉంది. వీరు ఇంటింటికీ తిరిగి లబ్దిదారుల జాబితాలో వివరాలను తనిఖీ చేస్తారు.  ఆ సమయంలో ఆచూకీలేకున్నా.. సమయానికి ఇంటిలో అందుబాటులో లేకున్నా, గ్రామం విడిచి వేరే ప్రాంతానికి వెళ్లినా, అనివార్య కారణాలతో తనిఖీ కమిటీ దృష్టిలో పడకున్నా.. వారి పింఛన్ తొలగిస్తారు.



 గ్రామస్థాయి కమిటీలిచ్చిన నివేదికలను మండలస్థాయి కమిటీ పరిశీలించి కలెక్టర్‌కు సమర్పించనున్నారు. మండలస్థాయి కమిటీలో ఎంపీడీవో, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, డ్వాక్రాసభ్యులు ఉంటారు. మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో వార్డు కౌన్సిలర్ లేదా డివిజన్ కార్పొరేటర్‌తోపాటు బిల్‌కలెక్టర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రాసభ్యులు ఉంటారు. జిల్లా కమిటీలో జిల్లా మంత్రితోపాటు కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ సభ్యులుగాంటారు.  కమిటీల నియామకంపై బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో వాటిలో సభ్యుల నియామకానికి గురువారం ఒక్కరోజే గడువుంది.



 5.50 లక్షల మందిలో అయోమయం

 జిల్లాలో సుమారు 5.50 లక్షల మంది అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వివిధ రకాల పింఛన్లు అందుకుంటున్నారు. వీరికి నెలకు సుమారు రూ. 18 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి పింఛన్ అందాలంటే, అదనంగా సుమారు రూ.40 కోట్లు పైచిలుకు అవసరమవుతోందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దీంతో ఈ మొత్తాన్ని ఎంతవరకు తగ్గించాలనేది సమగ్ర సర్వేలో భాగమనే చెప్పాలి. గ్రామ, మండలస్థాయి కమిటీల్లో తమకు నచ్చని వారి పేర్లను తొలగించడం, కావాలనుకున్న పేర్లు చేర్చడం వంటి చర్యలకు అడ్డూ అదుపులేకుండా ఉంటుందని లబ్ధిదారులు ఆందోళనపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top