టీడీపీ నేతలదాష్టీకం

టీడీపీ నేతలదాష్టీకం - Sakshi


 విజయనగరం మున్సిపాలిటీ:  పట్టణంలోని ఖరీదైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యవైఖరి కారణంగా రూ. కోట్లు విలువ చేసే స్థలాలు టీడీపీ నేతల చెరలోకి వెళుతున్నాయి.  తాజాగా  అధికార పార్టీకి చెందిన నాయకుడొకరు వివాదస్పద స్థలాన్ని ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా వైన్‌షాపు ఏర్పాటు చేశారన్న ఆరోపణలొచ్చాయి. అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.  కానీ అధికారులు మీన మీషాలు లెక్కిస్తున్నారు. గంటకో మాట చెప్పి గందరగోళం సృష్టిస్తున్నారు.

 

 సదరు స్థలంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గాను పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయన్న విమర్శలొస్తున్నాయి.    మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డు పరిధిలో గల కొత్తగ్రహారం ఒకటవ వీధిలో ఆర్‌అండ్ బి  జిల్లా కార్యాలయం ఎదురుగా సర్వేనంబర్ 54, 143లలో  సుమారు 500 గజాల స్థలం  ఎవరదనేదన్న విషయంలో   స్థానికుడైన కొణతాల వేణుగోపాలరావు  అనే వ్యక్తికి, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం కొనసాగుతోంది.  హైకోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తోంది.

 

 అయితే ప్రస్తుతం ఈ స్థలంలో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే టీడీపీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు.   వాస్తవానికి ఈ దుకాణం గాజులరేగ ప్రాంతంలో పెట్టుకునేందుకు  అబ్కారీ శాఖ అధికారులు అనుమతినివ్వగా అక్కడి స్థానికులు దుకాణ ఏర్పాటును వ్యతిరేకించ డంతో  అధికార పలుకుబడిని ఉపయోగించి   కొత్తగ్రహారం ఒకటవ వీధిలో ఏర్పాటు చేసేశారు. ఇదే విషయమై 38వ వార్డు కౌన్సిలర్ గార సత్యనారాయణ, స్థానికులు పి.సుబ్బారావు, బిఎమ్‌ఎమ్ కృష్ణ, ఎం.అప్పారావు, టీవీఆర్ నాగేశ్వరరావు, టీ.శ్రీనివాసరావు తదితరులు సోమవారం జరిగిన గ్రీవెన్‌సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

 

 దుకాణం ఏర్పాటులో నిబంధనలకు నీళ్లు

 వాస్తవానికి మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి స్థానిక కొత్తగ్రహారంలో దుకాణం ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల మేరకు బడికి, గుడికి 100 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయకూడదు.

 

 అయితే కొత్తగ్రహరంలో అధికారి పార్టీ కౌన్సిలర్ ఏ ర్పాటు చేసిన దుకాణం మాత్రం నిబంధనలకు అతిక్రమించి ఉంది. ఆ షాపునకు ఐదు మీటర్ల దూరంలో పాఠశాల ఉండగా...30 మీటర్ల దూరంలో చిన్న పిల్లల ఆస్పత్రి, కామర్స్ కళాశాల ఉన్నాయి. అంతే కాకుండా సదరు షాపునుంచి తూర్పుకు 10 మీటర్ల దూరంలో రామమందిరం,పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాలకు నిత్యం ఉదయం, సాయంత్ర వేళల్లో వందలాది మంది భక్తులు వచ్చివెళుతుంటారు. కళాశాల, పాఠశాల విద్యార్థులు నిత్యం ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయటాన్ని స్థానికులు తీవ్ర ంగా  వ్యతిరేకిస్తున్నారు.

 

 పట్టించుకోని మున్సిపల్ అధికారులు

  పట్టణం నడిబొడ్డున  ఉన్న  విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించకుని నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికుల వాదన.    

 

 ఎక్సైజ్ అధికారులను నిలదీసిన స్థానికులు

 కాగా, షాపు వద్దకు సోమవారం సాయంత్రం వచ్చిన ఎక్సైజ్ అధికారులను స్థానికులు నిలదీశారు. పాఠశాలలు, దేవాలయాలు, ఆసుపత్రులు ఉన్నచోట అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కానీ ఎక్సైజ్ అధికారులు మౌనమే సమాధానంగా దాటవేసి వెళ్లిపోయారు.

 

 పరిశీలించి చర్యలు తీసుకుంటాం

 పట్టణంలోని 38వ వార్డు పరిధిలో గల కొత్తగ్రహారం ఒకటవ వీధిలో మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. ఇటీవల స్థానికులు పిర్యాదు చేశారు. ఈ విషయంపై  టౌన్‌ప్లానింగ్ అధికారులతో పరిశీలించి  తగు చర్యలు తీసుకుంటాం.

 - కమిషనర్ సోమన్నారాయణ.

 

 అనుమతులు ఇవ్వలేదు

 కొత్తగ్రహారం ఒకటవ వీధిలోగలమున్సిపాలిటీ స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటుకు ఎవరికీ అనుమతివ్వలేదు. ఈవిషయం ఇంత వరకు మాదృష్టికి తీసుకురాలేదు. సర్వేయర్‌ను ఆప్రాంతానికి పంపించాం. మంగళవారం వాస్తవ పరిస్థితేంటో తేలుతుంది. మున్సిపల్ స్థలమైతే చర్యలు తీసుకుంటాం.            - లక్ష్మణరావు, టీపీఓ

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top