రైతు నోట్లో మట్టే

రైతు నోట్లో మట్టే - Sakshi


- మదనపల్లె, చిత్తూరు డివిజన్లలో భూముల విలువ పెంపు 2 శాతమే

- మిగిలిన ప్రాంతాల్లో 30 శాతం పెంపు

- భూ సేకరణలో నష్ట పరిహారం తగ్గించుకోవడానికే ఈ తతంగం

- కోట్లాది రూపాయలు నష్టపోనున్న బాధిత రైతులు

రాష్ట్రంలో భూముల విలువను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువ సవరణను ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ మేరకు జిల్లాలోని తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో భూముల విలువ 30 శాతం పెంచింది. మదనపల్లె, చిత్తూరు డివిజన్లలో మాత్రం రెండు శాతమే పెంచింది. ఈ ప్రాంత వాసులపై సర్కారుకు ఎంత ప్రేమో అని జనం అనుకున్నారు. అసలు విషయం ఏమిటం టే పడమటి మండలాల్లో వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించనుంది. రైతులకు చెల్లించే నష్టపరిహారం తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

పలమనేరు:
ప్రస్తుతం మదనపల్లె, చిత్తూరు డివిజన్ల పరిధిలో హంద్రీ-నీవా సుజల స్రవంతి, కుప్పం విమానాశ్రయం, చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ సిక్స్ ట్రాక్ హైవే, ఎన్‌హెచ్-4 నాలుగు లేన్ల రహదారికి ప్రభుత్వం వేలాది ఎకరాల భూములను సేకరించనుంది. ఇందుకు నష్ట పరిహారంగా బాధిత రైతులకు కోట్లాది రూపాయలు  చెల్లించాల్సి ఉంది. అయితే భూముల విలువ పెంచితే  ఆ మేరకు రైతులకు చెల్లించాల్సిన పరిహారం కూడా పెంచాల్సి వస్తుంది. అందువల్లే పెంపును కేవలం రెండు శాతానికి పరిమితం చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా బాధిత రైతులకు కోట్లాది రూపాయలు నష్టం రావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఏపీ రివిజన్ ఆఫ్ మార్కెట్ వ్యాల్యూ గైడ్‌లైన్స్ రూల్స్ 1998 ప్రకారం జిల్లాలోని రూరల్, అర్బన్ ప్రాంతాల్లో భూముల విలువను పెంచేందుకు జూలై 8న ఆదేశాలు జారీచేసింది. దీనిపై అర్బన్ ప్రాంతాలకు సంబంధించి జేసీ చైర్మన్‌గా, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో చైర్మన్‌గా సంబంధిత మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా రెండ్రోజుల క్రితం చిత్తూరు, మదనపల్లెల్లో సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

పడమటి ప్రాంతాల్లో జోరుగా భూసేకరణ

జిల్లాలోని పడమటి మండలాల్లో ఇప్పటికే హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టును భౌగోళికంగా 14,630 చదరపు కిలోమీటర్లలో నిర్మించనున్నారు. ఇందులో మెట్ట భూములు 97,679 ఎకరాలు, నీటి ఆధారం ఉన్న భూములు 17 వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు నుంచి కుప్పం వరకు అవసరమైన భూములను త్వరలో సేకరించనున్నారు.  

 

చెన్నై-బెంగళూరు మధ్య 268 కి.మీ. మేర రూ.4,800 కోట్లతో నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ హైవే కోసం వీకోట, బెరైడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాళ్యం, గుడిపాల మండలాల్లో సుమారు 80 కిమీ మేరకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఈ మధ్య భూ సేకరణ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. రూ.1,038 కోట్లతో చెన్నె-బెంగళూరు జాతీయ రహదారి-4  విస్తరణ పనులు కర్ణాటక సరిహద్దులోని ఆలకుప్పం నుంచి తమిళనాడు సరిహద్దులోని ముత్తరాసికుప్పం వరకు 84 కి.మీ. మేర త్వరలో జరగనున్నాయి. ఇందులో పలమనేరులో 7.5కి.మీ., బంగారుపాళ్యంలో 5.6 కి.మీల బైపాస్ రోడ్లు, దాదాపు 43 గ్రామాలు, పట్టణాల గుండా 432 ఎకరాల భూమిని సేకరించనున్నారు.



కుప్పం నియోజకవర్గంలో విమానాశ్రయ నిర్మాణం కోసం 1,200 ఎకరాల భూమి అవసరముంది. గంగవరం వద్ద పారిశ్రామిక వర్గాలకు అవసరమైన భూముల కేటాయింపులు జరగనున్నాయి. దీంతో పాటు స్థానికంగా హైటెన్షన్ విద్యుత్ టవర్లు, రైలు మార్గం తదితరాలకు సర్వే కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికంతటికీ రైతులకు సంబంధించిన భూములకు ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో భూముల విలువ పెంచితే ఆ మేరకు పరిహారం కూడా పెరుగుతుంది కాబట్టే ఇక్కడ భూముల విలువ కేవలం రెండు శాతం పెంపునకే కమిటీలు అనుమతి ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఫలితంగా భూములు కోల్పోయే రైతులు కోట్లాది రూపాయల పరిహారాన్ని కోల్పోయినట్టే.

 

పెంచిన రెండు శాతంలోనూ మతలబు

పెరిగిన మార్కెట్ విలువ ప్రకారం మెట్ట భూములకు 2శాతం, నీటి ఆధారిత భూములకు 5, తోపులకు 10, ఇళ్ల స్థలాలకు 5, మున్సిపాలిటీలో 7.5 శాతం మాత్రం పెంచారు. భూసేకరణలో ఎక్కువగా భూములు కోల్పోయే మెట్ట రైతులకు తీరని నష్టం తప్పదు. తోపులు తక్కువగా ఉన్నాయి కాబట్టి దాని విలువను పది శాతానికి పెంచడం వెనుక ఆంతర్యం ఇదేనని పలు విమర్శలున్నాయి. ఈవిషయమై జిల్లా రిజిస్ట్రారు మధుసూదన్‌రెడ్డిని వివరణ కోరగా కమిటీ నిర్ణయం మేరకే ఆదేశాలు జారీచేశామన్నారు. అయితే ఇందులో ఎలాంటి మతలబులున్నాయో తనకైతే తెలియదన్నారు. ఒకవేళ భూసేకరణ విషయం కూడా ఉండొచ్చునేమో అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top