ఉప్పుటేరునూ మింగేశారు


 భీమవరం :  ప్రభుత్వ భూములను కబ్జా చేయడంలో అక్రమార్కులకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. చివరికి ఉప్పుటేరు పరివాహక ప్రాంతంలోని భూములనూ మింగేస్తున్నారు. భూములను కబ్జా చేసి దర్జాగా చెరువులు తవ్వి రొయ్యలను సాగుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మత్తు నిద్రను వీడడం లేదు.



 దొంగపిండి, లోసరిలో 100 ఎకరాల కబ్జా భీమవరం మండలంలోని కృష్ణాజిల్లా సరిహద్దు గ్రామాలైన దొంగపిండి, లోసరిలు ఉప్పుటేరును ఆనుకుని ఉన్నాయి. డ్రెయిన్ మధ్యలో గట్టు పక్కన 120 ఎకరాల బీడు భూములు ఉన్నాయి. వీటిలో 100 ఎకరాలను అక్రమార్కులు కబ్జా చేసేశారు. చెరువులు తవ్వేసి రొయ్యలను సాగు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు.



మిగిలిన భూమిపైనా కన్నేసి దాన్ని చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. దొంగపిండి నుంచి లోసరి వరకు ఉన్న ఉప్పుటేరులో గట్టును ఆనుకుని కిక్కిస, మడ అడవులు, ఆల్చీ దుబ్బులతో కూడిన బీడు భూములు ఉన్నాయి. చెట్లను నరికివేసి చెరువులు తవ్వేయడంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



 రెండు జిల్లాల మధ్య తగాదా

 ఉప్పుటేరు మధ్యలో ఉన్న బీడు భూముల్లో పాగా వేసేందుకు అటు కృష్ణా జిల్లాలోని పల్లిపాలెం, లక్ష్మీపురం గ్రామస్తులు ఇటు పశ్చిమలోని లోసరి, దొంగపిండి గ్రామాల మధ్య తగవు నడుస్తోంది. ఇటీవల పల్లిపాలెం గ్రామస్తులు లోసరి వైపు ఉన్న డ్రెయిన్ భూమిలోకి వచ్చి జెండాలు పాతి భూఆక్రమణ చేసేందుకు ప్రయత్నించగా ఇటువైపు గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరు జిల్లాలలోని గ్రామాల మధ్య ఆ భూములు మావంటే మావని వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా అధికారులు సర్వే చేయించి అధికభాగం లోసరిలోనే ఉన్నాయని తేల్చారు.



 జోరుగా పంపకాలు

 లోసరి సమీపంలో ఉప్పుటేరులో ఉన్న సుమారు 50 ఎకరాల బీడు భూములను గ్రామస్తులు కుటుంబాలలోని రేషన్‌కార్డుల వారీగా గుర్తించి పంపకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. పోరంబోకు భూమిలో పాగా వేసి వాటిలో కూడా రొయ్యల సాగు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top