మ..మ..మాస్ కాపీ కోసమేనా?


 బొబ్బిలి: బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ను మార్చారు. ఇప్పటివరకూ ఇన్‌చార్జి పాలన సాగిస్తున్న జయంతి ప్రకాశంను బదిలీ చేస్తూ ఆయన స్థానంలో విశాఖ ఓల్డ్ ఐటీఐ నుంచి భట్టు రామారావును నియమించడంతో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. సాంకేతిక విద్యాశాఖ ద్వారా ప్రస్తుతం ఐటీఐలో కీలకమైన సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. రేపటి నుంచి థియరీ పరీక్షలు జరుగుతుండడంతో ఇప్పుడు ఆకస్మాత్తుగా ప్రిన్సిపాల్‌ను మార్చడంపై పలు సందేహాలు వినిపిస్తున్నాయి.. థియరీ పరీక్షల్లో అవకతవకలు, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ప్రిన్సిపాల్ ప్రకాశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షల కోసం ఎగ్జామినర్లుగా విశాఖకు చెందిన స్టీల్‌ప్లాంటు, ఇతర కంపెనీల నుంచి ఉన్నతోద్యోగులను తీసుకువచ్చారు.

 

 థియరీకి స్థానిక ఇన్‌స్ట్రక్టర్లను వేయకుండా రెవెన్యూ ఉద్యోగులు కావాలని ఆ శాఖ అధికారులను కోరారు. ఇక్కడ పనిచేస్తున్న ఇనస్ట్రక్టర్లను ఇతర ఐటీఐలకు ఇన్విజిలేటర్లుగా వేశారు. దీంతో వారంతా ప్రిన్సిపాల్ ప్రకాశంపై అక్రోశంతో ఉన్నారు. అలాగే గతంలో బొబ్బిలిలో ఉన్న ప్రైవేటు ఐటీఐలన్నింటి విద్యార్థులకు ప్రభుత్వ ఐటీఐలోనే పరీక్షలు జరిపేవారు.. ఆ సమయంలో జరిగే మాస్ కాపీయింగ్, ఇతరత్రా సాయం వల్ల విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేవారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ప్రకాశం వచ్చిన తరువాత గత ఏడాది పరీక్షల్లో మాస్ కాపీయింగ్ లేకుం డా చేయడంతో ప్రెవేటు యాజమాన్యం గుర్రుగా ఉంది. దీంతో ఇక్కడ అయ్యప్ప ఐటీఐ విద్యార్థులకు పార్వతీపురంలోని జ్యోతి ఐటీఐలో పరీక్షలు రాసే విధంగా ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఇక శ్రీనివాస ఐటీఐ మాత్రం ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే ఆఖరి నిమిషంలో బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐకి వచ్చారు.

 

 బొబ్బిలి ఐటీఐని వద్దనుకుని బయటకు ప్రైవేటు ఐటీఐ వాళ్లు వెళ్లిపోవడంతో ఈ నెల 16వ తేదీన ‘బొబ్బిలి వద్దు బాబోయ్’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడింది.. ఆతరువాత వరుసగా ఐటీఐలో జరుగుతున్న కథనాలపై ముగ్గురు విద్యార్థులకు ఒకటే పరీక్షా పత్రం, విద్యార్థులకు ఆన్‌లైన్ ఇక్కట్లు వంటివి అనేక కథనాలు వచ్చాయి. వీటన్నింటితో ఈ ప్రిన్సిపాల్‌ను ఇక్కడ నుంచి పంపాలని నిర్ణయించుకుని ఉన్నత స్థాయిలో తీవ్రంగా పైరవీలు చేశారు. అవి ఫలించడంతో విశాఖ ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ అధికారిగా పనిచేస్తున రామారావును ఎకాఎకిన బొబ్బిలికి బదిలీ చేసి ఆ స్థానానికి ప్రకాశాన్ని పంపారు.

 

 ప్రకాశం ముక్కుసూటిగా ప్రశ్నించడంతో పాటు ఉద్యోగులందరినీ క్రమశిక్షణలో పెట్టడం, ఎవరికి కేటాయించిన ట్రేడుల్లో వారు ఉండేలా, ఆ పిల్లలకు విద్య నేర్పేలా చూడాలని చెప్పడం వంటివి ఇక్కడ బోధకులకు రుచించేది కాదు. దాంతో నిత్యం ఏదో ఒక ఫిర్యాదు ప్రిన్సిపాల్ ప్రకాశంపై వెళ్తూనే ఉండేది. వాటిని ఎదుర్కొంటూనే తన మార్కు పాలన చూపించేవారు. మొత్తానికి ఇక్కడ నుంచి 17 నెలలకే బదిలీ చేసి గతంలో ఈ ఐటీఐలో టెక్నికల్ అధికారిగా పనిచేసిన రామారావును ప్రిన్సిపాల్‌గా తీసుకువచ్చారు. ఇక రేపటి నుంచి జరుగుతున్న థియరీ పరీక్షలకు ప్రకాశం వేసిన రెవెన్యూ సిబ్బంది ఉంటారో, ఈ ఐటీఐ ఇనస్టక్లర్లే ఉంటారో చూడాలి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top