అడ్డొస్తే అంతే..!

అడ్డొస్తే అంతే..!


నిర్వాసితులపై దూకుడుగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం

పచ్చని పంట పొలాలు ధ్వంసం

అడ్డు వచ్చిన వారిపై లాఠీ జులుం  




హిరమండలం:

వంశధార రిజర్వాయర్‌ నిర్మాణ విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. అడ్డు వ చ్చిన వారిని ఎలాగైనా అణచి వేయాలని చూ స్తోంది. పోలీసు బలగాల సాయంతో పనులు చేస్తోంది. క్షేత్ర స్థాయిలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా, వారి అభ్యంతరాలను, అభ్యర్థనలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో నిర్వాసితులు కూడా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి మళ్లీ సమయం రాదని భావిస్తున్నారు. ఇప్పుడు ఆందోళన చేయకపోతే తమ సమస్యలు శాశ్వతంగా ఉండిపోతాయని భయపడుతున్నారు.  



వచ్చే ఖరీఫ్‌ వరకు అవకాశం ఉన్నా ..

రిజర్వాయర్‌ నిర్మాణ పనులు వచ్చే ఖరీఫ్‌కు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఆలోచించి 2018 జనవరి 5 నాటికి పూర్తి చేయాలని చూస్తోంది. ఈ ఖరీఫ్‌కే సాగునీరు అందిస్తామని చెప్పినా ఆ మేరకు పనులు చేయలేకపోయారు. దీంతో నిర్వాసిత గ్రామాల వారు పంటలు వేసుకున్నారు. డిసెంబర్‌లో పంటలు చేతికొచ్చేస్తాయి. జనవరిలో సొంత గ్రామాల్లో సంక్రాంతి జరుపుకుని ఆ గ్రామాలను ఖాళీ చేయాలని వారు భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి మనోభావాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది. రైతు కళ్ల ముందే పొలాన్ని ధ్వంసం చేయడానికి పూనుకుంటోంది.



భయాందోళనలో నిర్వాసితులు

పన్నెండు రోజులుగా వంశధార నిర్వాసితులు పోలీసు పహారా మధ్యనే బతుకుతున్నారు. కనీసం సమస్యలు చెప్పుకునేందుకు అధికారులను కలిసే వీలు కూడా లేకుండా జీవిస్తున్నారు. గ్రామాల నుంచి బయటకు వస్తున్న వారిని అరెస్టు చేస్తుండడంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి నాట్లు వేస్తే బలవంతంగా నాశనం చేస్తున్న వైనంపై కుమిలిపోతున్నారు.



నత్తనడకన ప్రాజెక్టు పనులు

వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్నట్లు వంశధార రిజర్వాయర్‌ పనులేవీ అంత చురుగ్గా సాగడం లేదు. జనవరి 5 నాటికి ప్రాజెక్టు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైనా పనులు మాత్రం అప్పటికి పూర్తయ్యేలా కనిపించడం లేదు. స్పిల్‌వే పనుల్లో భాగమైన హెడ్‌ రెగ్యులేటర్, లింక్‌ కెనాల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో జరగడమే లేదు. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులకు సుమారు 70 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు ఇంకా చేయాల్సి ఉంది. అలాగే లింక్‌ కెనాల్‌పై బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా వానలు పడుతుండడంతో ఆలస్యమవుతోంది.

తులగాం గెడ్డ, గార్లపాడు సమీపంలో రెండు గట్ల మధ్య ఖాళీలను కలిపేందుకు సుమారు 24 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి సేకరించాల్సి ఉంది. దీంతో పాటు రాతి కట్టడాల పనులు, 0 నుంచి 750 వద్ద గట్టు పనులు చేయాల్సి ఉంది. ఇవన్నీ నాలుగు నెలల్లో పూర్తవుతాయో లేదో వేచి చూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top