అంత తేలిగ్గా అర్థం కాదు

అంత తేలిగ్గా అర్థం కాదు - Sakshi


*బడ్జెట్‌పై వెంకయ్య వ్యాఖ్య




సాక్షి. హైదరాబాద్: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత సులువుగా అర్ధమయ్యేది కాదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.సంక్షిప్త వివరాలను చూస్తే బడ్జెట్ అర్థం కాదని, లోతుపాతులకు వెళ్లి చూడాల్సి ఉంటుందని చెప్పారు. అలా చూడకుండానే కొందరు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. సహచర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.



దేశంలో ఆదాయాన్ని పెంచి దానిని అందరికీ పంచి సంక్షేమాన్ని కలిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అన్నీ ఫ్రీ అంటూ కాలం గడిపేయొచ్చనీ కానీ  దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను చూడాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్న దాన్లోంచి రూ.5 లక్షల కోట్లను ముందుగా ఆర్థిక సంఘం నిధుల రూపేణా రాష్ట్రాలకు ఇచ్చేసిందని, మిగిలిన దాంట్లోనే బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులకు అవకాశం ఉంటుందన్న విషయం ప్రజలు, రాష్ట్రాలు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ఆదాయంలో రాష్ట్రాల వాటాగా ఇస్తున్న దానికి అదనంగా ఒకేసారి పది శాతం నిధులను 14వ ఆర్థిక సంఘం ద్వారా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.



ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రాబోయే ఐదేళ్లలో కేంద్రం రెండు లక్షల కోట్లు అందజేస్తుందని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న సీఎం చంద్రబాబుతో శనివారమే తాను మాట్లాడినట్టు వెంకయ్య తెలిపారు. లోటుపాట్లు ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాట్లాడమని చెప్పానన్నారు. బహిరంగ చర్చలకన్నా కలిసి కూర్చొని మాట్లాడడం మంచిదన్నారు. బాబు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని తాను అనుకోవడం లేదని, బాధను వ్యక్తం చేసినట్టుగా భావిస్తున్నానన్నారు.



బాబుతో పవన్‌కల్యాణ్ భేటీ పెద్దగా ప్రాధాన్యమే ముంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తుది నిర్ణయమేమీ జరగలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఆర్థిక శాఖ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని చెప్పారు. పోలవరానికి  కేటాయింపులు తక్కువన్న దానితో తానూ ఏకభవిస్తున్నట్టు వెంకయ్య చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top