లోటు పూడ్చేందుకు ఇదే మందు

లోటు పూడ్చేందుకు ఇదే మందు - Sakshi


విజయనగరం రూరల్ :  ఒక పక్క బెల్ట్ దుకాణాలు నిషేధించిన ప్రభుత్వం, మరో పక్క రెవెన్యూ లోటని చెబుతూ మద్యం అమ్మ కాలను మరింత పెంచాలని లోపాయికారీగా ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బెల్ట్ దుకాణాలు నిషేధిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వెం టనే నిషేధిస్తూ జీఓ జారీ చేశారు. వెంటనే జిల్లాలో ఆరు వేల వరకు అనధికార మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టి కేసులు నమోదు చేశారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదన్న నెపంతో గత ఏడాది కంటే 20 శాతం అమ్మకాలు పెంచాలంటూ ఇటీవల ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు విశ్వసనీయ సమాచారం.

 

 దీనిపై ఇటీవల ఎక్సైజ్ అధికారులు ఆశాఖ ఎస్‌హెచ్‌ఓలు, మద్యం వ్యాపారులతో సమావేశమై అమ్మకాలు పెంచాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. మద్యం వ్యాపారులు దీనికి అంగీకరించలేదని, తాము విక్రయాలు పెంచలేమని తెగేసి చెప్పినట్టు సమాచారం.  మీ లక్ష్యాలను చేరుకునేందుకు నూతన మద్యం విధానంలో నిర్వహించిన లాటరీలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాలకు సింగిల్ టెండర్లు వేయించి మమ్మల్ని నట్టేట ముంచేశారని ఈ సమావేశంలో అధికారులపై దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు భోగట్టా. దరఖాస్తు చేసుకుంటే దుకాణాలు దక్కిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీనిచ్చారని,  అవసరం తీరాక దుకాణాలపై దాడులు పెంచి నష్టం కలుగజేస్తున్నారని  తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేసినట్టు తెలిసింది.  ఒక వైపు బెల్ట్ దుకాణాలు నిషేధించి,  ఇప్పుడు 20 శాతం అమ్మకాలు ఎలా పెంచగలమని వ్యాపారులు అధికారులను నిలదీసినట్టు సమాచారం.  దీంతో అధికారుల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న చందంగా తయారైంది.  

 

 ధరలు పెంచి విక్రయాలు

 కొద్ది రోజులుగా జిల్లాలో మద్యం ధరలను విపరీతంగా పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. దీనివెనుక అధికార పార్టీ నేతలే కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఆర్‌పీ కంటే అదనంగా ధరల పెంచడం లో  టీడీపీ, బీజెపీ నాయకుల పాత్ర ఉందని  విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గజపతినగరం, బొబ్బిలి, విజయనగరం, ఎస్.కోట, కొత్తవలస, నెల్లిమర్ల మండలాల్లో మద్యం ధరలు పెరగడంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరలు విపరీతంగా పెంచేసి విక్రయాలు సాగిస్తున్నా  ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్టు మిన్నుకుంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top