ఈ ప్రభుత్వం ఇంతే


సాక్షి, కడప : ‘జనం ఇక్కట్లను ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ప్రజల సమస్యలంటే బుట్టదాఖలే. తాగునీటి సమస్యకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపండ’ని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో తాగునీటి సమస్యపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, అధికారులకు సూచించారు. పులివెందులలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, కమిషనర్ విజయసింహారెడ్డి, వైస్ చెర్మైన్ చిన్నప్ప, పలువురు కౌన్సిలర్లు కలిసి మాట్లాడారు. పులివెందుల మున్సిపాలిటీకి అవసరమైన నీరు సీబీఆర్ నుంచి నక్కలపల్లె వరకు రావడం గగనంగా మారిందని వివరించారు. సమస్య తీవ్ర రూపం దాల్చకుండా సీబీఆర్ నుంచి ఎస్‌ఎస్ ట్యాంకు వరకు పైపులైన్ ఏర్పాటు చేయాలని వారు జగన్ దృ ష్టికి తీసుకొచ్చారు. అందుకు దాదాపు రూ.5 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని వివరించారు. ఈ విషయంపై జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలు చేయడం తప్ప స్పందించదన్నారు.

 

 పైపులైన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సూచించారు. అవసరమైతే తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృ షి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు 11 ఎంఎల్‌డి నీటిని తీసుకుంటూ 9 ఎంఎల్‌డి సరఫరా చేస్తున్నారని, మిగిలిన నీటిని మున్సిపాలిటీకి కేటాయిస్తే వేసవి నుంచి గట్టెక్కవచ్చని వారు వివరించగా.. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

 

 నూతన వధూవరులకు ఆశీర్వాదం పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీలో నివసిస్తున్న దేవిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, పద్మాలత కుమారుడు జగదీశ్వరరెడ్డి, భార్గవిల వివాహం పులివెందులలో రెండు రోజుల క్రితం జరిగింది. అప్పట్లో వివాహానికి హాజరు కాలేకపోయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం వారి ఇంటికి వెళ్లి నూతన జంటను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అంతకు ముందు అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు.

 

  తర్వాత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరిన జగన్‌కు పలుచోట్ల ఘన స్వాగతం లభించింది. పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీలో బాణాసంచా పేల్చుతూ స్వాగతం పలకగా.. ముద్దనూరులో నల్లబల్లె ఎంపీటీసీ సభ్యుడు వరదారెడ్డి, జమ్మలమడుగు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు హనుమంతురెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ముద్దనూరు నాలుగు రోడ్ల సర్కిల్‌కు చేరిన భారీ జన సందోహానికి అభివాదం చేసిన అనంతరం.. మహిళలు, వృద్ధులను ఆయన ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. అనంతరం ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, దువ్వూరులో అభిమానులు జగన్ కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేశారు.  

 

 వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం కడప ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తదితరులు కలిసి వైఎస్ జగన్‌తో చర్చించారు. తర్వాత అందరూ జగన్ వెంట ఆళ్లగడ్డకు వెళ్లి శోభా నాగిరెడ్డి ప్రథమ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top