ఏరివేతలో కలిపిమేత!


సాక్షి, కర్నూలు : బోగస్ ఏరివేతకు ప్రధాన అస్త్రమని ప్రభుత్వం భావించిన ఆధార్ అనుసంధానంలోనూ ఉన్న చిన్నపాటి లోపాన్ని కొందరు డీలర్లు, బోగస్ లబ్ధిదారులు అనుకూలంగా మలుచుకున్నారు. బోగస్ లబ్ధిదారులకు ఆధార్ నమోదు సంఖ్య (ఈఐడీ)లు వేసి కొన్నాళ్లపాటు కొనసాగేలా చేసుకున్నారు. ఆధార్ అనుసంధానం వరకు జిల్లాలో 11,47,030 లక్షల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్న విషయం విదితమే. 2011 జనాభా లెక్కలు ప్రకారం 10,18,617 కుటుంబాలు మాత్రమే ఉండడంతో బోగస్‌కార్డులు ఉన్నట్లు తేలతెల్లమైంది. ఆధార్ అనుసంధానం ద్వారా బోగస్ కార్డులు ఏరివేతకు ప్రభుత్వం యోచించింది. ఈ క్రమంలో ఆధార్ సంఖ్యలు ఇవ్వని లబ్ధిదారులు, కార్డుల వివరాలు తొలగిస్తామని జిల్లా అధికారులు ఇంతకుముందే ప్రకటించారు. విశిష్ణ ప్రాధికార సంస్థ జారీచేసిన ఏకీకృత గుర్తింపు సంఖ్య(యూఐడీ) లేకపోయినా నమోదు చేసుకున్నప్పుడు ఇచ్చిన ఈఐడీ ఇచ్చినా సరిపోతుందని అధికారులు చెప్పడంతో బోగస్ లబ్ధిదారులకు, వారి పేరుతో కార్డులు అనుభవిస్తున్న చౌకధరల దుకాణాల డీలర్లకు అవకాశం కలిగింది. కొందరు బోగస్ లబ్ధిదారులకు ఈఐడీలు అనుసంధానం చేసి కార్డులు కొనసాగేలా చేశారు.

 

 ఎలా చేశారంటే..?

 జిల్లా వ్యాప్తంగా పలు బోగస్ కార్డులు, పలువురు బోగస్ లబ్ధిదారులు ఉన్నారు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, బనగానపల్లె, డోన్, బేతంచర్ల, ప్యాపిలి, కోడుమూరు, తదితర పట్టణాలతోపాటు చిన్న పట్టణాల్లో వీరి సంఖ్య ఎక్కువగా, మిగతాచోట్ల తక్కువగా ఉన్నాయి. బయోమెట్రిక్ కార్డులు, ఆ తర్వాత రచ్చబండ సందర్భంగా కార్డులిచ్చినప్పుడు స్థానికంగా లేనివారి పేర్లపై  కొందరు డీలర్లు కార్డులు తీసుకున్నారు.

 

 ఇతర జిల్లాల్లో ఉన్నవారి పేరున ఫొటోలు దిగి కార్డులు రాయించారు. జిల్లాలో ఉన్న పాత లబ్ధిదారుల పేరున కూడా రచ్చబండలో తాత్కాలికంగా కార్డులు పొందారు. ఆధార్ సంఖ్య అనుసంధానం చేసినప్పుడు ఒక వ్యక్తి దేశంలో ఎక్కడ ఉన్నా, ఎన్ని కార్డుల్లో ఉన్నా తెలిసిపోతుంది. ముందు ఒరిజినల్ కార్డుకు ఆధార్ సంఖ్య ఇచ్చినవారు తర్వాత బోగస్ కార్డుకు ఈఐడీ ఇచ్చారు. ఒకసారి ఆధార్ తీసుకున్న తర్వాత యూఐడీ ఒకేసారి వస్తుంది. ఈలోగా ఎన్నిసార్లయినా నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఈఐడీ వస్తుంది. ఇలా వచ్చిన ఈఐడీ ఇవ్వడం ద్వారా బోగస్ లబ్ధిదారులు చలామణిలో ఉండిపోయారు.

 

 1.50 లక్షల బోగస్ కార్డులు..: జిల్లా వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల బోగస్ కార్డులు ఉన్నట్లు అంచనా. 6,77,685 మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఆధార్ అనుసంధానంలో తిరస్కరించారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ లో బోగస్ కార్డుల బాగోతం వెలుగులోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కొందరు రేషన్‌డీలర్లు కుమ్మక్కై ఈ బోగస్ కార్డుల ద్వారా సబ్సిడీ సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ప్రతి నెలా 6.77 లక్షల కిలోల బియ్యం, 3 లక్షల లీటర్ల కిరోసిన్, 3.35 కిలోల చక్కెర, గోధుమలు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది.

 ఉన్నదెందరు:జిల్లాలో ఈఐడీ ఇచ్చిన లబ్ధిదారులు 4,73,033 మంది ఉన్నారు. వీరంతా ఈఐడీ ఇచ్చి నెలలు గడుస్తోంది. అంటే ఇప్పటికే యూఐడీ జారీ చేసే ఉంటారు. వారు నేరుగా ఆ సంఖ్య సమర్పించి అనుసంధానం చేసుకోవాలి. అలా చే యడం లేదు. ఆ నంబరు ఇవ్వకపోవడం వెనుక పదేపదే నమోదు చేయించుకున్న సందర్భాల్లో యూఐడీ రాదని తెలి యడం ఒక కారణంగా తెలుస్తోంది. ఇలా సుమారు లక్షన్నర మంది వరకు ఉండొచ్చని అంచనా.

 

 ఈ విషయం ప్రభుత్వం కూడా అనుమానించింది. అందుకే ఈ నెల 15వ తేదీలోగా ఈఐడీ ఇచ్చినవారి నుంచి యూఐడీ తెప్పించాలని అధికారులను ఆదేశించింది.అప్పటికి ఎవరైనా ఇవ్వకుండాఉంటే వారి ని బోగస్‌గా గుర్తించి తొలగించే అవకాశముంది. ఈ విష యం పౌరసరఫరాల అధికారి కూడా స్పష్టం చేశారు. ఈ దిశ గా సీఎస్‌డీటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరో 10 రోజుల్లో బోగస్‌ల విషయం తేలనుందని చెప్పవచ్చు.     

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top