వీరి అవసరం..వారికి ఆదాయం


కర్నూలు(జిల్లా పరిషత్): భూముల ధరలు పెరగనుండడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్లకు విశేష స్పందన వస్తోంది. రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. వీరి బలహీనతను ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బందిమామూళ్లకు తెరలేపారు. అన్ని డాక్యుమెంట్లు కరెక్టుగా ఉన్నా తెలియని తప్పులు చూపుతూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో రిజిస్ట్రేషన్‌పై కార్యాలయంలో రూ.20వేల నుంచి రూ.40వేల వరకు చేతులు మారుతున్నాయి.

 

 జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా మండల, మున్సిపాలిటీల పరిధిలోని సబ్‌రిజిస్టార్‌ల ప్రతిపాదనలను జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలోని కమిటీ పది రోజుల క్రితం ఆమోదించింది.  జిల్లాలో 20 నుంచి 60 శాతం వరకు స్టాంప్ డ్యూటీ పెంచేసింది. 2013 ఏప్రిల్ ఒకటిన స్టాంప్ డ్యూటీని పెంచారు. మార్కెట్‌లో విక్రయిస్తున్న ధరల కంటే చెల్లిస్తున్న ధర తక్కువగా ఉందని, ఈ కారణంగా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో రెండురోజుల్లో భూముల విలువలు పెరిగితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ భారం అధికమవుతుందన్న కారణంగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ సోమవారం నుంచి రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. జిల్లాలో 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో కర్నూలు, కల్లూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, మున్సిపాలిటీల పరిధిలో బుధ, గురువారాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు కర్నూలులో 272 రిజిస్ట్రేషన్లు జరగ్గా,  27 నుంచి 30వ తేదీ వరకు 490 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. అలాగే కల్లూరులో సోమవారం నుంచి గురువారం వరకు 458 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

 

  పెరిగిన మామూళ్లు

 సందట్లో సడేమియా అన్నట్లు ప్రజల అవసరాన్ని, భయాన్ని ఆసరగా చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగులు భారీగా మామూళ్ల మొత్తాన్ని పెంచేశారు. ఏదైనా భూమి, ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించాలంటే ముందుగా డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లాలి. డాక్యుమెంట్ చేయడానికి రూ.1000 నుంచి రూ.1500ల వరకు వసూలు చేస్తున్నారు. అయితే అనధికారికంగా కొంతమంది కీలక డాక్యుమెంట్ రైటర్లు దళారులుగా మారారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, స్థలం లిటికేషన్‌లో ఉందని చెబుతూ రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఫలితంగా డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన మేరకు కాస్త అటూ ఇటూగా బేరమాడి మామూళ్లు ముట్టచెప్పి పని ముగించుకుంటున్నారు. ఇటీవల బుధవారపేటలోని ఓ స్థలానికి ఎలాంటి ఇబ్బందులూ లేకున్నా కోర్టు చిక్కులు ఉన్నాయంటూ ఓ కీలక ఉద్యోగి రూ.2లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి అందరి ముందూ గట్టిగా వాదించడంతో రూ.2లక్షల మొత్తం కాస్తా రూ.20వేలకు దిగినట్లు చర్చ జరుగుతోంది.  ఏమీ తెలియకుండా రిజిస్ట్రేషన్‌కు వెళ్లే వారికి పలు రకాల భయాలు సృష్టించి ఉద్యోగులు లబ్ధిపొందుతున్నారు. కార్యాలయంలో ఒక్కోసీటుకు ఒక్కో రేటు చెబుతూ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top