పింఛనుంటేనే.. ప్రాణం నిలిచేది...


  • వైఎస్సార్ బువ్వ పెడితే లాగేస్తారా?

  •  గత ప్రభుత్వానికి పింఛనుదారుల సూటి ప్రశ్న

  •  గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : వయసుడిగిపోయిన వృద్ధులు, దిక్కుమొక్కులేని వితంతువులు, సొంతకాళ్లపై నిలబడలేని వికలాంగులు, రెక్కాడితేగానీ డొక్కాడని నేతకార్మికులను ఆదుకునే నాధుడే కరువయ్యాడని వాపోతున్నారు. నెలానెలా అందాల్సిన పింఛన్ ఎంతకాలమైనా అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఒక పింఛనుదారుడు చనిపోతే గానీ వేరేవారికి పింఛన్ ఇవ్వలేమన్న  చంద్రబాబు పాలన రోజులు మళ్లీ గుర్తుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  



    నెలకు  కేవలం  రూ.75 పింఛన్ ఇచ్చేవారని... అదీ నెలనెలా కాకుండా జన్మభూమి జరిగినపుడు జనం తగ్గకుండా ఉండేందుకు వృద్ధుల్ని ఆరు నెలలకు ఒకసారి సభలకు పిలిపించి, అక్కడ ఇస్తామంటూ అగచాట్లకు గురిచేసేవారని గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ అలాంటి దుర్ధినం రాకూడదని  ఆ దేవున్ని వేడుకుంటున్నామని పింఛన్‌దారులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు.

     

     మానవతావాది, దివంగత మహానేత వైఎస్ హయాంలో....



     దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విస్తర వేసి భోజనం పెడితే..సీల్డుకవర్ పాలకులు వచ్చి  తమ నోటి దగ్గరున్న బువ్వను లాగేశారని  పింఛనుదారులు అంటున్నారు.  చంద్రబాబు హయాంలో కేవలం రూ.75 ఉండే వృద్ధాప్య పింఛన్‌ను పేద వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని మానవతావాదంతో వైఎస్ రూ.200కు పెంచారు. అప్పటి వరకు పెద్దపెద్ద సిఫారసులు ఉన్న వారికే ఇచ్చే అరకొర  ఫించన్ల సంఖ్యను  అర్హులైన వారందరికీ వర్తింజేశారు. 1,44,219 వృద్ధులు, 5,550 నేత కార్మికులు, 30,320వికలాంగులకు,  80,130వితంతువులు  వైఎస్సార్‌హయాంలో పింఛన్లు పొందినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లుగా పింఛన్లను లబ్ధిదారులకు అందే విధంగా వినూత్న పాలనను అందించారాయన. ఏ వృద్ధులయినా అనారోగ్య రీత్యా రాలేకపోయినా... కనీసం 5వ తేదీ లోగా  ఇంటి ముంగిటకు పింఛన్లను పంపించే విధంగా ఉద్యోగుల్ని ఆదేశించి  వర్తింపజేసిన ఘనత మహానేతకే దక్కుతుంది.

     

     చేతకాని కిరణ్ సర్కార్...



     పింఛన్లను అందజేసేందుకు కిరణ్ సర్కార్ అడ్డమైన సాకులు చెబుతూ పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. జిల్లాలో ఇప్పటికి సుమారు 3.22లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. కాని వారిలో దాదాపు 30వేల మందిని వివిధ కారణాలు చూపి తొలగించారు. స్మార్ట్‌కార్డులు, ఆధార్ కార్డులు లేవని, ఫింగర్ ప్రింట్స్ పడలేదన్న సాకులతో పింఛనుదారుల్ని ప్రభుత్వ జాబితా నుంచి తొలగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెండు నెలల నుంచి కొంతమందికి పింఛన్లు ఇవ్వటం లేదు. మరి కొంతమందికి   నెల నుంచి ఎగనామం పెట్టేశారు.  గ్రామ పంచాయతీల మెట్లపై పింఛనుదారులు  వెయ్యి కళ్లతో అమాయకంగా ఎదురు చూస్తున్న దృశ్యాలు నిత్యం గోచరిస్తున్నాయి. ఆ నాలుగు డబ్బులూ   కాస్త మందులకు ఉపయుక్తమవుతాయన్న వారి దయనీయ స్థితి అందర్నీ కంటిచెమ్మ పెట్టిస్తోంది.

     

     వైఎస్సే పింఛను పెంచాడు...

     ఆ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి నా పింఛన్‌ను పెంచి, నాకు పెద కొడుకయ్యారు. చంద్రబాబు పాలనలో రూ.75 తీసుకునేవాడిని. దానిని రూ.200కు  పెంచిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఆ విధంగా మాకు న్యాయం చేయాలంటే ఆయన తనయుడు జగన్‌కు మాత్రమే సాధ్యమవుతుంది.  వెనుకా ముందూ ఎవరూ లేరు. ఇప్పుడు మా పింఛన్లే తీసేశారు. ఎవరికి చెప్పుకోవాలి.

     - కాగిత రాఘవయ్య, శేరీ దగ్గుమిల్లి(గుడ్లవల్లేరు మండలం)

     

     మహానేతే మంజూరు చేశాడు...

     దివంగత ముఖ్యమంత్రి  వైఎస్. రాజశేఖరరెడ్డి నా పింఛన్‌ను ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేశాడు. రెండు నెలలుగా పింఛను ఇవ్వబోమని పొమ్మంటున్నారు. రోజూ వచ్చి పంచాయతీ మెట్ల వద్ద కూర్చున్నా ఎవరూ మా ముఖం చూడటం లేదు. మందులు, తిండికి డబ్బులు లేక ఏడుపు వస్తుంది. పింఛను డబ్బులు వాటికి వాడుకునేదానిని. జగన్ ఒక్కడే మా కష్టం తీరుస్తాడనే నమ్మకం ఉంది.

     - బొల్లా రఘుపతమ్మ, శేరీ దగ్గుమిల్లి(గుడ్లవల్లేరు మండలం)

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top