పుష్కరాలు ముగిశాయ్.. సమస్యలు మిగిలాయ్


 నరసాపురం అర్బన్:పుష్కర సంరంభం ముగిసింది. అధికారులు, ఉద్యోగులు 20 రోజులపాటు పుష్కర విధుల్లో తలమునకలు కావడంతో అన్ని శాఖల్లో పనులు దాదాపుగా నిలిచిపోయాయి. కీలక శాఖల్లో ముఖ్యమైన పనులు పెండింగ్‌లో పడిపోయాయి. జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగమంతా పుష్కర విధులకే సమయం కేటాయించింది. దీంతో పుష్కరాలు జరిగిన ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలోని అన్నిచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖ, ఫిషరీస్, ఎక్సైజ్, మునిసిపల్, వ్యవసాయ శాఖతోపాటు దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు పుష్కర విధుల్లో ఉండిపోయాయి.

 

 దీంతో ఆయా శాఖల్లో పనులు కుంటుపడ్డాయి. పుష్కరాలు జరిగిన ప్రాంతాల్లో అయితే దాదాపు మూడు నెలల నుంచీ అన్ని ప్రభుత్వ శాఖలు పుష్కర జపం తప్ప మరోపని పెట్టుకోలేదు. దీంతో సమస్యలు పేరుకుపోయాయి. మహాపర్వం ముగిసిన అనంతరం అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సోమ, మంగళ వారాలు సెలవు ఇచ్చింది. బుధవారం నుంచి వారంతా విధులకు హాజరు కానున్నారు. విధుల్లోకి వచ్చాక సమస్యలు, పెండింగ్ పనులను పూర్తి చేయడానికి యంత్రాంగమంతా మరికొన్ని రోజులపాటు పుష్కరాల్లో మాదిరిగానే ఊపిరి సలపకుండా పని చేయాల్సి ఉంది. మరి వీరంతా వాటిపై ఏ మేరకు దృష్టిపెడతారనేదే ప్రశ్నార్థకంగా ఉంది.

 

 అయోమయంలో రైతులు

 జిల్లాలోని రైతులంతా అయోమయంలో ఉన్నారు. ఖరీఫ్ సాగు ఈ ఏడాది ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ తలపోసినప్పటికీ అన్నుకున్నంత స్థాయిలో సాగలేదు. జూలై నాటికి నాట్లు పూర్తవ్వాలి. కాలువలు ఆలస్యంగా వదలడం, శివారు ప్రాంతాలకు నీరందకపోవడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. డెల్టాలోని నరసాపురం, మొగల్తూరు, భీమవరం ప్రాంతాల్లో ఇంకా చాలాచోట్ల దుక్కులు దున్నడం కూడా పూర్తవ్వలేదు. అంటే సాగు దాదాపు నెల రోజులుపైనే ఆలస్యమైంది. వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉంది. రెవెన్యూకు సంబంధించి అన్ని పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. కలెక్టర్ సైతం పుష్కరాల పనులు, ఏర్పాట్లపై నెల రోజులపాటు ప్రధానంగా దృష్టిపెట్టారు. దీంతో రెవెన్యూ పాలన కుంటుపడింది.

 

 నరసాపురం, కొవ్వూరు డివిజన్లలో మూడు వారాలుగా ‘మీ కోసం కార్యక్రమాలు సైతం నిర్వహించడం లేదు. అత్యవసర పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్న వారు, అధికారులు, సిబ్బంది అందుబాటులో లేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. మునిసిపాలిటీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నరసాపురం, కొవ్వూరు మునిసిపాలిటీల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలజారీ నుంచి అన్ని పనులు నిలిచిపోయాయి. ఈ రెండు మునిసిపాలిటీల్లో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)  మందకొడిగా సాగాయి. మిగిలిన మునిసిపాలిటీల అధికారులు, సిబ్బంది డెప్యుటేషన్‌పై పుష్కర విధులకు రావడంతో అన్ని మునిసిపాలిటీల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.

 

 పెండింగ్ పనుల సంగతేంటి!

 నరసాపురం, కొవ్వూరు పట్టణాల్లో పుష్కరాల సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. అలాంటివన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. పుష్కరాలు సమీపించేసరికి ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఘాట్లకు సమీపంలో చేపట్టిన పనులను పూర్తిచేసి, మిగిలిన పనులు పెండింగ్ పెట్టారు. డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం వంటి కీలక పనులు ఈ జాబితాలో ఉన్నాయి. నరసాపురంలో రూ.15 కోట్లు, కొవ్వూరులో రూ.12 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది. ఖర్చు చేయని పుష్కర నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే ప్రచారం సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు నిధులు వెనక్కి వెళ్లవని భరోసా ఇస్తున్నప్పటికీ.. ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉంది కాబట్టి నిధులు వెనక్కి మళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదనే ఆందోళన కూడా ఉంది. పుష్కర విధుల్లో అలసిపోయిన అధికారులు వెంటనే పుష్కర పెండింగ్ పనులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top