గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు


  • ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి  

  • మంత్రిగా బాధ్యతల స్వీకరణ

  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం అధికారికంగా మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ-బ్లాకులో తనకు కేటాయించిన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్ర తొలి క్యాబినెట్‌లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమర్ధ పనితీరు ద్వారా సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.



    గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీఐడీ విచారణ నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. న్యాయశాఖ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.



    యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల తరహాలోనే బాసర సరస్వతికీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని అమలు చేస్తామని తెలిపారు. కాగా, సహచర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కోసం పనిచేస్తానని అదే జిల్లాకు చెందిన మరో మంత్రి జోగు రామన్న చెప్పారు. శుక్రవారం ఇంద్రకరణ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా రామన్న ఆయన చాంబర్‌కు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top