జల పుష్పాలొచ్చాయ్


ఏలూరుటూటౌన్/కొవ్వూరు/ నరసాపురం అర్బన్/పెనుగొండ రూరల్ :కలెక్టర్ కె.భాస్కర్ వైఖరిపై ఇరిగేషన్ ఇంజినీర్లు నిరసన గళం విప్పారు. కలెక్టర్ తీరు బాధాకరంగా ఉందని ఇంజినీర్లు వాపోయారు. లక్ష్యాలను పూర్తి చేస్తున్నప్పటికీ కలెక్టర్ వ్యవహార శైలి ఇంజినీర్ల ఆత్మగౌరవం, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ హుందాగా వ్యవహరిం చాలని, లేదంటే అన్ని శాఖలు, అన్ని స్థాయిల ఇంజినీరింగ్ అసోసియేషన్లతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని అల్టిమేటం జారీ చేశారు. గతంలో కలెక్టర్‌ను బదిలీ చేయాలని ఎన్జీవోలు ఆందోళనబాట పట్టగా.. ప్రజాప్రతినిధుల జోక్యంతో ఆ వివాదం సమసిపోయింది. తాజాగా పుష్కరాలు, ప్రాజెక్టుల పనుల విషయంలో కలెక్టర్ తీరుపై ఇంజినీర్ల అసోసియేషన్ శనివారం నిరసన గళం విప్పింది.

 

 మీ ఇష్టానుసారంగా ఉంది : కలెక్టర్ నరసాపురం, సిద్ధాంతం, కొవ్వూరు ప్రాంతాల్లో పుష్కర పనులను శనివారం పరిశీలించిన కలెక్టర్ భాస్కర్ అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తొలుత కొవ్వూరులో పర్యటించిన కలెక్టర్ బైపాస్ రోడ్డు నిర్మాణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోడ్డును పుష్కర యాత్రికుల కోసం ప్రతిపాదించారా.. రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేసుకునేందుకు చేస్తున్నారా అని మునిపిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్‌ను నిలదీశారు. పనులు పూర్తి చేయకుంటే పైసా బిల్లు కూడా ఇవ్వబోమని ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. ఏదో ఒకటి, రెండు మెషిన్లు పెట్టి  కథ నడిస్తారా.. అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వెలిబుచ్చారు.

 

  పుష్కర యాత్రికులకు ఉపకరించని రోడ్డుకు పుష్కర నిధులు చెల్లించేది లేదన్నారు. పట్టణంలో రూ.14 కోట్లతో సుందరీకరణ, బైపాస్ రోడ్డు పనులను చేస్తున్నప్పటికీ ఏరోజూ కాంట్రాక్టర్ కనిపించలేదన్నారు. కాంట్రాక్టర్ ఎక్కడని పదేపదే ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. ఈ పనులకు ఎవరు బినామీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఇంజినీరింగ్ అధికారులు చెప్పిన సమాధానానికి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్య స్నానఘట్టంలో సిమెంట్ రోడ్డు  పనులను మిల్లర్ల సాయంతో చేయడంపై ఆగ్రహం చెందారు. కాంక్రీట్ మిక్చర్ వాహనాలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని నిలదీశారు. ఇదే స్నానఘట్టంలో పిండప్రదానం షెడ్ల పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై ఇంజినీర్లను నిలదీశారు.

 

 ‘రాత్రి 9 గంటలకు మళ్లీ వస్తా. ఈలోగా ఇక్కడ లెవెలింగ్ పనులు ప్రారంభించకపోతే ఊరుకోన’ని హెచ్చరించారు. సీతారామస్నాన ఘట్టం ఎదురుగా నదిలో ఉన్న మట్టిగుట్టను ఆదివారం ఉదయానికి తొలగించకపోతే అందరినీ ఇంటికి పంపిస్తానంటూ నీటి పారుదల శాఖ ఇంజినీర్లను హెచ్చరిం చారు. ఆ సమయంలో కలెక్టర్ వెంట ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసులు, నీటిపారుదల శాఖ డీఈఈ జి.శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవో ఆర్ సూర్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సీహెచ్‌ఎస్‌ఎన్ రెడ్డి, డీఈ ఎఎస్‌ఎన్ మూర్తి, ఏడీఈ ఎం.కృష్ణనాయక్, గృహ నిర్మాణ శాఖ పీడీ  ఈ.శ్రీనివాస్, ఈఈ పి.రఘురాం ఉన్నారు.

 

 నరసాపురంలో కలెక్టర్ ఫైర్

 శనివారం రాత్రి నరసాపురంలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరుగా వలంధరరేవుకు చేరుకున్న కలెక్టర్ ఆ సమయంలో అక్కడ పనులేమీ చేయకపోవడాన్ని గమనించి కన్జర్వెన్సీ ఏఈని నిలదీశారు. కాంట్రాక్టర్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘కాంట్రాక్టర్లు పనులు చేయరు, అధికారులేమో కాంట్రాక్టర్లను వెనకేసుకొస్తారు. ఇలాగైతే పనులు ఎలా అవుతాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంధర రేవులో టైల్స్ పనులు, ఆర్చి పనులు తక్షణమే ప్రారంభం కావాలని, ఆదివారం ఉదయూనికి పూర్తి చేయాలని ఆదేశించారు.

 

 సిద్ధాంతంలో ఏఈ సస్పెన్షన్‌కు ఆదేశాలు

 సిద్ధాంతంలో గోదావరి హెడ్‌వర్క్స్ ఏఈ కె..జయరాజును సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం రాత్రి సిద్ధాంతం కేదారిఘాట్‌లోని పనులను ఆయన పరిశీలించారు. అక్కడ పనులు అసంపూర్తిగా ఉండటాన్ని చూసిన కలెక్టర్ ఏఈ జయరాజును నిలదీశారు. అధికారులు బాధ్యతతో వ్యవహరించడం లేదంటూ విరుచుకుపడ్డారు. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జయరాజును సస్పెండ్ చేయూలని ఆదేశించారు. 48 గంటల్లో రేవు నిర్మాణం కొలిక్కిరాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భాస్కర్ హెచ్చరించారు.

 

  హుందాగా వ్యవహరించండి : ఇంజినీర్ల సూచన

 కలెక్టర్ కె.భాస్కర్ ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో సముచితంగా, హుందాగా వ్యవహరించాలని జిల్లా నీటి పారుదల శాఖ ఇంజినీర్ల సంఘం కోరింది. ఏలూరులోని డేటా కాంప్లెక్స్‌లో జిల్లా నీటి పారుదల ఇంజినీర్ల సమావేశం శనివారం జరిగింది. జిల్లాలోని ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కలెక్టర్ భాస్కర్ ఇంజినీర్లతో వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరు-చెట్టు, పుష్కర పనులు, పోలవరం కుడి ప్రధాన కాలువ, రబీకి నీటి విడుదల ఇతరత్రా పనులను ఇంజినీర్లు కష్టపడి చేస్తున్నారని, నిర్ణీత కాలవ్యవధిలో లక్ష్యాలను పూర్తి చేస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంజినీర్ల ఆత్మగౌరవం, మనోభావాలు దెబ్బతినేవిధంగా కలెక్టర్ ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 కలెక్టరేట్‌లో తరుచూ జరిగే సమీక్షా సమావేశాల్లోనూ ఉన్నతస్థాయి ఇంజినీర్లను సైతం విమర్శించడంపై పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇంజినీర్ల సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు కలెక్టర్ హుందాగా వ్యవహరించాలని కోరారు. ఇదే పద్ధతి కొనసాగితే అన్ని శాఖలు, అన్నిస్థాయిల ఇంజినీరింగ్ అసోసియేషన్లతో రాష్ట్రస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని సమావేశం అల్టిమేటం ఇచ్చింది. జిల్లా ఇంజినీర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం.అప్పారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్‌టీ రాజేశ్వరరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటనారాయణ, కోశాధికారి ఎం.రూపేష్ వర్మ, ప్రధాన కార్యదర్శులు వై.అర్జునరావు, డి.భార్గవ్‌ప్రకాష్, ఉపాధ్యక్షుడు పి.గనిరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top