చిన్నారిని పీడిస్తున్న మహమ్మారి

చిన్నారిని పీడిస్తున్న మహమ్మారి - Sakshi


విజయనగరం కంటోన్మెంట్: చిరునవ్వులొలికిస్తున్న ఈ చిన్నారికి ఈ లోకంలో ప్రాణమేంటో..? ఆ ప్రాణాలను హరించే రోగాలేంటో ఏం తెలుసు? అందరిలాగే తానూ ఈ లోకంలో పుట్టానని, తనకూ ఆ దేవుడు ఓ ప్రాణాంతక వ్యాధిని ఆపాదించాడనీ తెలియని ఈ పాపాయి కలివిడిగా నవ్వుతుంటే చూస్తున్న తల్లిదండ్రులు మానసికంగా కుంగిపోతున్నారు. జామి మండలం కుమరాం గ్రామానికి చెందిన వరప్రసాద్, చిన్నారి దంపతుల ఒక్కగానొక్క సంతానం రెండేళ్ల సాధన. పుట్టిన దగ్గరనుంచి చలాకీగా అందరిలా చిలకపలుకులు పలుకుతూ..తల్లిదండ్రులు ఉప్పొంగిపోయేలా ఆడుకుంటూ ఆటపట్టిస్తూ ఉండే సాధనకు గత డిసెంబర్‌లో నడుము కింది భాగంలో చిన్న కాయ రావడంతో విజయనగరంలోని కృష్ణా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చూపించారు. ఆస్పత్రి వైద్యులు దీనిని అనుమానించి శాంపిల్‌ను తీసి విశాఖకు పంపించి బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు.

 

 దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అభంశుభం తెలియని మా చిన్నారికే ఈ మాయదారి రోగం రావాలా అని ఆవేదన చెందారు. వెంటనే తేరుకుని వైద్యుల సూచన మేరకు ైెహ దరాబాద్‌లోని నిమ్స్ క్యాన్సర్ విభాగానికి వెళ్లి చికిత్స చేయించేందుకు అడ్మిట్ చేశారు. అయితే ఓ ప్రైవేటు కంపెనీలో గుమస్తాగిరీ చేస్తున్న వరప్రసాద్‌కు తన బిడ్డ చికిత్సకు అవసరమయ్యే మందులు ఇతర ఖర్చులు భరించే స్థోమత లేదు. ఇప్పటికే బంధువులు, తెలిసిన వారి దగ్గర ఓ లక్ష వరకూ అప్పులు చేసి ఖర్చు చేశాడు. కానీ ఇంకా ఏడాదిన్నర పాటు చికిత్స చేయిస్తే కానీ నయమయ్యేదీ లేనిదీ చెప్పలేమని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమకు ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే చిన్నారి సాధనకు చికిత్స చేయించుకుని మందులు ఖర్చులు భరించే అవకాశం ఉంటుందని కోరుతున్నారు. ఇందుకోసం వరప్రసాద్ ఎస్‌బీహెచ్ అకౌంట్ నంబర్ 62323362442(ఐఎఫ్‌సీ:ఎస్‌బీహెచ్‌వై0020484)ను  ఇస్తూ సహాయం చేయాలని కోరుతున్నారు.

 

 ఆర్థిక సహాయం చేసిన స్నేహితులు

 వరప్రసాద్ స్నేహితుడైన కేశవరావు.. తాను పనిచేస్తున్న శ్రీచక్ర సిమ్మెంట్స్ డీలర్లు, సేల్స్ ఆఫీసర్లను సంప్రదించి అంతా కలిసి రూ.13,600ను అంజేశారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top