బాలికపై లైంగిక దాడి, హత్య!

బాలికపై లైంగిక దాడి, హత్య! - Sakshi


 తులసీగాం(ఇచ్ఛాపురం): అభం, శుభం తెలియని 16 ఏళ్ల యువతి శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇచ్ఛాపురం మండలం తులసీగాంలో సంచలనం సృష్టించింది. అయితే మృగాళ్ల పైశాచానికే బాలిక భవానీ బిసాయి మృతి చెందింద న్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒంటిపై గాట్లు, రక్తపు మరకలు చూస్తే కనీసం ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. లైంగికదాడికి పాల్ప డి ఆతర్వాత హతమార్చారని స్థానికులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... నిరుపేద కుటుంబానికి చెందిన భవానీ తండ్రి చనిపోవడం, తల్లి సోదరుడు రమేష్‌తో పాటు చెన్నైకు వలస వెళ్లిపోవడంతో నాయనమ్మ పార్వతితో కలిసి తులసీగాంలో పూరింట్లో నివాసముంటోంది.

 

 పార్వతి శుక్రవారం పర్లాకిమిడి వెళ్లడంతో భవానీ ఒక్కర్తే ఇంట్లో ఉంది. ఉదయం 8 గంటలకు కుళాయి నీటికోసం వచ్చే భవానీ ఎంతకీ రాకపోవడంతో ఆమె పిన్ని లక్ష్మి ఇంటికి వచ్చి తులపు కొట్టింది. ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఇంటి వెనుక భాగం నుంచి వెళ్లి తాళాలు తీసి లోపలకు వెళ్లగా భవానీ రక్త కారుతూ పడి ఉండడాన్ని చూసి అవాక్కయింది. ఇరుగుపొరుగు వారిని పిలిచి భవానీని మంచం మీదకు చేర్చింది. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిపించి చూపించగా భవానీ మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఇచ్ఛాపురం సీఐ శ్రీనివాసరావు, రూరల్ ఎస్‌ఐ బి.రామారావు సంఘటనా స్థలానికి చేరి స్థానికులను విచారించారు.

 

 సాయంత్రం కాశీబుగ్గ డీఎస్పీ ఎం.దేవప్రసాద్ క్లూస్ టీంతో కలిసి పరిశీలించారు. మృతదేహం పడివున్న తీరు, ఒంటిపై ఉన్న గాయాలు పరిశీలిస్తే లైంగికదాడి చేసి హతమార్చారన్న అనుమానం కలుగుతోందని స్థానికులు అంటున్నారు. రహస్య భాగాల్లో రక్తపు మరకలు ఉన్నాయని చెబుతున్నారు. భవానీ చేయి, మెడ, జబ్బపై రక్తం మరకలు కనిపించాయి. కుడిచేయి మణికట్టు తాడుతో కట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. కాగా మృతదేహంపై చీమలు పాకుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లోంచి కేకలు వినిపించాయని కొందరు అంటున్నారు. రెండు పూరిళ్ల మధ్య ఉన్న చూరు నుంచి దుండగులు లోపలకు ప్రవేశించి ఉంటారని భావిస్తున్నారు.

 

 ఈ సంఘటనతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసి పర్లాకిమిడి నుంచి భవానీ నాయనమ్మ పార్వతి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపింద్దామనుకుంటే ఇలా జరిగిందని రోదించారు. చెన్నైలో ఉన్న భవాని సోదరుడు,తల్లి స్వగ్రామానికి బయలుదేరారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనకు సంబంధించి ధర్మపురం గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

 

 రాత్రి ఒంటి గంటకు బాలిక ఫొన్‌లో మిస్డ్ కాల్ ఉందని, దాని ఆధారంగా కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సంఘటనను గూర్చి ముందుగా అందరికి సమాచారం ఇచ్చిన మరో యువకుడుపై కూడా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ యువకుడు శనివారం రాత్రి గ్రామం నుంచి పరారైనట్లు తెలిసింది. అనుమానాస్పద స్థితిలో మృతిగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top