ఆ అమ్మకు భారమైనట్లుంది..

ఆ అమ్మకు భారమైనట్లుంది..


నంద్యాల టౌన్: మాతృదేవోభవ.. అంటూ అమ్మను దేవతగా పూజించే పుణ్య భూమిలో ఓ అమ్మకు తన ఆడబిడ్డ భారమైనట్లుంది. అందుకే ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లింది. ఆ పనికూనను ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఆగ్నేష్‌ఏంజల్ అక్కున చేర్చుకుని, ప్రభుత్వ ఆసుపత్రిలోని పురిటిపిల్లల వార్డులో చేర్పించారు. ఈ సంఘటన ఆదివారం శ్రీనివాస నగర్‌లోని ఒక నర్సింగ్ హోంలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం బండిఆత్మకూరు మండలం ఓంకారం గ్రామానికి చెందిన దర్గమ్మ ప్రసూతి నొప్పులతో బాధపడుతూ నర్సింగ్‌లో చేరింది. వైద్యులు ఆదివారం ఉదయం ఆమెకు కాన్పు చేశారు. ఆమె చందమామలా ముద్దులొలికే చిన్నారికి జన్మనిచ్చింది. ఈ చిన్నారి ఏడు నెలల్లోనే పుట్టడంతో, కేవలం కేజిన్నర బరువు ఉంది. కాని ఆడబిడ్డ పుట్టిందని తెలుసుకున్న దర్గమ్మ ఆమె బంధువు మళ్లీ వస్తామని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. మంచంపై అమ్మ పాలు కోసం గుక్కతిప్పుకోకుండా రోదిస్తున్న చిన్నారిని చూసి, అదే ప్రాంతానికి చెందిన యువకుడు అర్బన్ ఐసీడీఎస్ ఆఫీసు వెళ్లి సమాచారాన్ని అందించారు. ఆగ్నేష్ ఏంజల్, సిబ్బంది వెళ్లి, చిన్నారిని అక్కున చేర్చుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోని పురిటి పిల్లల విభాగంలో అప్పగించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

 పోషించలేకనే: చిన్నారిని తల్లి పోషించలేకనే వదిలించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈమె భర్త దూరమైనట్లు ఒక కుమారుడు ఉన్నారు. తాను బతకడమే భారంగా ఉందని, ఆడబిడ్డను పోషించలేనని ఆసుపత్రి సిబ్బందితో చెప్పినట్లు సమాచారం.  



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top