దెయ్యాలు మింగుతున్నాయ్!

దెయ్యాలు మింగుతున్నాయ్! - Sakshi


- ప్రభుత్వ పథకాలపై సీఎం వ్యాఖ్య

- మూతపడిన పరిశ్రమలు తెరిపించాలన్న కార్మిక నేతలపై బాబు తీవ్ర ఆగ్రహం

 

 సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో సంక్షేమ పథకాలను దెయ్యాలు తీసుకుంటున్నాయని, వాటిని ఏరిపారేస్తామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. శనివారం విశాఖకు వచ్చిన సీఎం  పలు కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా చేసిన ప్రసంగాల్లో పై విధంగా వ్యాఖ్యానించారు. సీతమ్మధారలో రూ.8.30 కోట్లతో నిర్మించిన వుడా వాణిజ్య భవన సముదాయాన్ని, వంద మీ సేవ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం కేంద్రమంత్రులు కల్రాజ్‌మిశ్రా, వెంకయ్యనాయుడుతో కలసి పూడిమడకలో రూ.120 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఎంఎస్‌ఎంఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువే చేస్తున్నామని, అలాంటప్పుడు హోదాతో పనేముంటుందని ప్రశ్నించారు. రైల్వేజోన్ సహా విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు.



 మీ వల్లే పరిశ్రమల మూత...

 ‘‘మీరు ఒక్క పరిశ్రమనైనా ఏర్పాటు చేయగలరా? మూతపడిన పరిశ్రమలను తెరిపించగలరా? ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇప్పించగలరా? జీతాలు ఇవ్వగలరా? ఉద్యమాలు చేసి పరిశ్రమలు రాకుండా అడ్డుపడేదీ మీరే.. మూయించేది మీరే.. ఇప్పుడు మూతపడిన పరిశ్రమలను తెరిపించమంటున్నారు. యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే నష్టం ఇలాగే జరుగుతుంది’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మిక సంఘాల నేతలపై విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు అచ్యుతాపురం సెజ్‌లో మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని, స్థానిక మత్స్య కారులకు ఉపాధి కల్పించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. వారిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్ విమానంలో గల్లంతైన ఎన్‌ఎడీ ఉద్యోగులు చిన్నారావు, నాగేంద్రబాబు కుటుంబాలను బుచ్చిరాజుపాలెం, లక్ష్మీనగర్‌లో వారి ఇళ్లకు వెళ్లి సీఎం పరామర్శించారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top