ఘట్టమనేనికిఎమ్మెల్సీ

ఘట్టమనేనికి ఎమ్మెల్సీ - Sakshi


విజయవాడ : స్థానిక సంస్థల కోటా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ప్రముఖ  నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (64) పోటీ చేయనున్నారు. శనివారం హోటల్ ఐలాపురంలో జరిగిన ‘సమరదీక్ష’ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిశేషగిరిరావు పేరును ప్రకటించారు. శేషగిరిరావు ప్రముఖ సినీనటుడు కృష్ణకు సోదరుడు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఆదిశేషగిరిరావుకు గత 40 ఏళ్లుగా విజయవాడతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 

1982లో విజయవాడలో రాజ్-యువరాజ్ థియేటర్లను ప్రారంభించడంతో పాటు 15 ఏళ్లపాటు నిర్వహించారు. గాంధీనగర్‌లో పద్మాలయ ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని శేషగిరిరావు నిర్వహించారు. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు, సింహాసనం తదితర సుమారు 100కు పైగా తెలుగు చిత్రాలు, 30 హిందీ చిత్రాలను, 10 తమిళ చిత్రాలను ఆదిశేషగిరిరావు నిర్మించారు. ఫిలిం పెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు.

 

శేషగిరిరావు ఏఐసీసీ కల్చరల్ కమిటీ కన్వీనర్‌గా, పీసీసీ జనరల్ సెక్రటరీగా 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. జిల్లాలోని రాజకీయ, వాణిజ్య, వ్యాపార, సినీ రంగ ప్రముఖలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  స్థానిక సంస్థల సభ్యులు తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. జిల్లా వాసులకు అందుబాటులో ఉంటూ ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top