చక్కని భూములనూ చెక్కుతారట!

చక్కని భూములనూ చెక్కుతారట! - Sakshi


చదును పేరుతో రూ. కోట్ల స్వాహాకు రంగం సిద్ధం



- కియా కార్ల పరిశ్రమ ఏర్పాటులో ఇదో బాగోతం

- పరిశ్రమ కోసం 599.35 ఎకరాలు సేకరించిన ఏపీఐఐసీ

- భూముల కొనుగోలు ఖర్చు రూ. 62.93 కోట్లు   

- చదును చేయడానికి రూ.177.94 కోట్లతో టెండర్లు

- రూ. 25 కోట్లకు మించి ఖర్చు కాదంటున్న కాంట్రాక్టర్లు 

- రూ. 152 కోట్లు కొట్టేయడానికి టీడీపీ పెద్దల పన్నాగం




మీరు ఎకరం భూమిని రూ.10 లక్షలకు కొంటే.. అందులో కంప చెట్లు, రాళ్లూరప్పలు తొలగించి చదును చేయడానికి రూ.29 లక్షలు ఖర్చు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా అలాంటి పనే చేస్తోంది. రూ.10.50 లక్షలకు భూమిని కొనుగోలు చేసి, దాన్ని చదును చేయడానికి రూ.29.71 లక్షలు ఖర్చు పెడుతోంది. అయితే అంటే స్థలం ధర కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువన్నమాట! ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందో తెలుసుకోవడానికి. ‘కియా’ కార్ల పరిశ్రమ పేరుతో అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సాగుతున్న అధికార తెలుగుదేశం పార్టీ నేతల దోపిడీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..



సాక్షి ప్రతినిధి, అనంతపురం: పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలంలో ఎర్రమంచి, అమ్మవారుపల్లి, దుద్దేబండ, వెంకటగిరిపాలెంలో కార్ల పరిశ్రమ ఏర్పాటు కు ‘కియా’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) 599.35 ఎకరాల భూమిని సేక రించింది. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున చెల్లిస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన నాలుగు గ్రామాల పరిధిలో 599.35 ఎకరాలు కోల్పోయిన రైతులకు రూ.62.93 కోట్ల పరిహారం దక్కనుంది.



మాయాజాలం అంతా ఇక్కడే

కార్ల పరిశ్రమ కోసం సేకరించిన భూమిని చదును చేసి ‘కియా’కు అప్పగించాలని ఏపీఐ ఐసీ నిర్ణయించింది. భూములను చదును చేసేందుకు ఏప్రిల్‌ 25న ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ పనికి రూ.177.94 కోట్లు ఖర్చవుతుందని నిర్ధారిం చింది. ఈ నెల 10 వరకు పలు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి.టెండర్ల దాఖలులో ఏపీఐఐసీ ఓ తిరకాసు పెట్టింది. టెండర్లు దాఖలు చేసిన ఏజెన్సీలు గత ఐదేళ్లలో కనీసం ఒక్క ఏడాది అయినా రూ.780 కోట్ల టర్నోవర్‌తో పనులు చేసి ఉండాలని నిబం ధన విధించింది. దీంతో కొన్ని ఏజెన్సీలు టెండర్ల దాఖలుకు వెనుకడుగు వేశాయి. ఈ నెల 10న టెక్నికల్‌ బిడ్‌లను పరిశీలించారు. ఇందులో ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు అర్హత సాధించాయి.



ఫైనాన్షియల్‌ బిడ్‌ను పరిశీలించి ఒక ఏజెన్సీకి టెండర్‌ ఖరారు చేయనున్నారు. 599.35 ఎకరాల కొనుగోలుకు రూ.62.93 కోట్లు ఖర్చు కాగా, ఆ స్థలాలను చదును చేయడానికి రూ.177.94 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇక్కడ చదును చేస్తున్న భూముల్లో ఏమీ రాళ్లూ రప్పలు లేవు. రైతులు ఎప్పటి నుంచో ఈ భూములను చదును చేసుకుని సాగు చేస్తున్నారు. ఈ మొత్తం భూములను చదును చేయడానికి రూ.25 కోట్లకు మించి ఖర్చు కాదని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ లెక్కన భూములను సరి చేసే పనుల్లో రూ.152 కోట్ల మేర అవినీతి జరగనున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేతోపాటు ‘చినబాబు’ కు లబ్ధి చేకూర్చడానికే అంచనా వ్యయాన్ని భారీగా పెంచి టెండర్లు పిలిచినట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. భూములకు ఇచ్చే పరిహారం కంటే చదును చేయడానికి రెండు రెట్లు ఎక్కువగా వెచ్చిస్తుండడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ప్రజల సొమ్మును కాజేయడానికే ఇంత ఖర్చు చేస్తున్నారని, చదును చేసేందుకు అక్కడ ఏముందని ప్రశ్నిస్తున్నారు.



పల్లె, పరిటాల భూములకు మినహాయింపు

వ్యవసాయం మినహా మరొకటి తెలియని రైతుల భూములను లాక్కున్న ప్రభుత్వం.. అధికార పార్టీ నేతల భూముల వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇక్కడ కియా కార్ల పరిశ్రమ ఏర్పాటవుతుందని ముందే తెలుసుకున్న అప్పటి మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మునిమడుగు పరిధిలో సర్వే నంబర్‌ 408 నుంచి 445 వరకు 378 ఎకరాలు కొనుగోలు చేశారు. మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులు 138 ఎకరాలను కొన్నట్లు సమాచారం. భూసేకరణ నుంచి ఈ భూములను అధికారులు మినహాయించారు. ఎక్కడి నుంచి భూములు సేకరిస్తారు? భూసేకరణ ఎక్కడితో ముగుస్తుంది? అనే సమాచారాన్ని ముందుగానే సేకరించి టీడీపీ నేతలు భూములు కొన్నట్లు తెలుస్తోంది. కార్ల పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతం సమీపంలోనే ఈ భూములున్నాయి.



రైతులే చదును చేసుకున్నారు..

‘కియా కార్ల పరిశ్రమ కోసం ప్రభుత్వం సేకరించిన 599.35 ఎకరాల్లో ఎక్కడా పెద్ద గుట్టలు లేవు. భూమిని చదును చేయాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి ఈ భూములు సాగులో ఉన్నాయి. రైతులే చదును చేసుకున్నారు’

– వెంకట్‌రెడ్డి, రైతు, అమ్మవారుపల్లి, పెనుకొండ మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top