బండపై బాదుడు


అరవిందనగర్‌లో నివాసముంటున్న శేఖర్‌బాబు గ్యాస్ బుక్ చేశాడు. రూ.719 చెల్లించాలని మెసేజ్ వచ్చింది. బాయ్ సిలిండర్ డెలివరీ చేసి రూ.750 ఇవ్వాలన్నాడు. ఇదేమిటని శేఖర్ ప్రశ్నించాడు. రూ.30 ఎక్కువ ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా అడగడంతో తప్పదన్నట్లు రూ.750 ఇచ్చి పంపించాడు శేఖర్. ఇది ఒక్క శేఖర్ అనుభవమే కాదు. నగరంలో ప్రతి గ్యాస్ వినియోగదారుడు సిలిండర్ ధరపై అదనంగా ఇచ్చుకోవాల్సిందే.

 

 అనంతపురం అర్బన్: గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో ‘బాయ్స్’ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత ధరపై రూ.30 అదనంగా వసూలు చేస్తున్నా రు. ఇవ్వకపోతే ఒక తంటా... ఈసారి సిలిండర్ బుక్ చేసినా సమాయానికి ఇవ్వరనే భయం. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటూ అదనంగా ఇచ్చేందుకు ప్రజలు అలవాటు పడ్డారు. ఇది ఎంతగా ఉందంటే నెలకు 60 వేల సిలిండర్లు డెలివరీ అవుతున్న ఒక్క అనంతపురంలోనే రూ.18 లక్షలుగా ఉంది.

 ఈ లెక్కన నగరంలోనే వినియోగదారుల నుంచి ఏడాదికి రూ.2.16 కోట్లు బాయ్స్ నొక్కేస్తున్నారనేది స్పష్టమవుతోంది. ఇలా జిల్లావ్యాప్తంగా ఎంత ఉంటుందో ఉహించుకుంటే నొరెళ్లబెట్టక తప్పదు.

 

 జిల్లాలో 64 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో డబుల్  సిలిండర్, సింగిల్ సిలిండర్, దీపం గ్యాస్ కనెక్షన్లు 7.52 లక్షలు ఉన్నాయి. ఇందులో ఐఓసీ 3.54 లక్షలు, హెచ్‌పీసీ 2.10 లక్షలు, బీపీసీ 1.88 లక్షలు ఉన్నాయి. వీటిలో ఒక్క అనంతపురం నగరంలోనే అత్యధికంగా 1.75 లక్షల మేర ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 7 వేల సిలిండర్ల వరకు డెలివరీ అవుతుంటాయి.

 

 సింగిల్ సిలిండర్‌పై మరింత రేటు

 జిల్లాలో సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు 3.23 లక్షలు ఉన్నా రు. అనంతపురం నగరంలో దాదాపు 20 వేలకు పైగానే ఉన్నాయి. ఈ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే బాయ్స్‌కి మరింత అదనపు ఆదాయమే వస్తుంది. సింగిల్ సిలిండర్ కాబట్టి తప్పని సరిగా తీసుకోవాలి. లేకపోతే పని జరగదు. దీన్ని ఆసరాగా చేసుకుని డెలివరీ బాయ్స్ సిలిండర్‌పై అదనంగా రూ.40 నుంచి రూ.వంద వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారుడి అవసరాన్ని బట్టి వసూలు చేసే మొత్తం ఉంటుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top