చోరీ ముఠాల అరెస్టు

చోరీ ముఠాల అరెస్టు


♦ 43 మోటారు సైకిళ్లు

♦ 136గ్రాముల బంగారు నగలు

♦ రూ.20వేల నగదు స్వాధీనం

 

 విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్‌లో చోరీలకు పాల్పడుతున్న పలు ముఠాలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో మోటారు సైకిళ్లు, నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఎల్.కాళిదాస్ అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావుతో కలిసి వివరించారు.



 రెండు ముఠాల అరెస్టు

 వేర్వేరుగా మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి రూ.8.55 లక్షల విలువైన 43 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సంగోజు విజయ్ భాస్కర్, పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన లంకా విజయ కుమార్ కలిసి ఇళ్లముందు పెట్టిన మోటారు సైకిళ్లను చోరీ చేశారు.  నిందితులను అరెస్టు చేసి పలు ప్రాంతాల్లో చోరీ చేసిన 22 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.



వీటి విలువ సుమారు రూ.3.68లక్షలు ఉంటుందని డిసీపీ చెప్పారు. గుణదలకు చెందిన కంచర్ల గోపినాథ్, చల్లమల్ల హేమంత్, చాతులూరి వసంత్, తాడిపత్రి రాజ్‌కుమార్, మామిడి శివ, పక్కి వినయ్ మరో బాలుడితో కలిసి మోటారు సైకిళ్లు చోరీ చేశారు. వీటిని ఉంగుటూరు మండలం వెల్దిపాడుకు చెందిన మెకానిక్ లామ్ నవీన్ ద్వారా విక్రయిస్తున్నట్టు గుర్తించి నిందితులతో పాటు మెకానిక్‌ను కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.4.87లక్షల విలువైన 21మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.



 మహిళల అరెస్టు

 వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు మహిళలను అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన నల్లబోతుల నాగమణి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తల్లి పుల్లమ్మతో కలిసి చోరీలు ప్రారంభించింది. గత నెల 18న బెంజిసర్కిల్ సమీపంలోని ఖజానా జ్యుయలరీ, లబ్బీపేటలోని మలబార్ జ్యుయలరీ దుకాణాల్లో నగలు చూపించే సేల్స్‌మేన్ ఆదమరిచి ఉన్న సమయంలో గిల్టు నగలు పెట్టి బంగారు నగలు చోరీ చేశారు. వీరిలో పుల్లమ్మ పరారీలో ఉండగా నాగమణిని అరెస్టు చేసి 40 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో చిట్టినగర్ గూడేల రాము వీధికి చెందిన కర్రి గాయత్రిని అరెస్టు చేసి 96 గ్రాముల బంగారు నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. బత్తుల నాగేశ్వరరావు ఇంట్లో పని చేసే గాయత్రి గత నెల 28న యజమానురాలు అనారోగ్యంతో ఉండటాన్ని గమనించి నానుతాడు చోరీ చేసింది.



 జేబు దొంగల అరెస్టు

 రద్దీ ప్రాంతాల్లో జేబు చోరీలకు పాల్పడుతున్న కేసులో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కోండ్రుపోలుకు చెందిన ఎరసాని సుబ్బారావు, ఎరసాని అంతర్వేది, కుంభా శ్రీను, చినమర్తి శ్రీనును అరెస్టు చేశారు. గత నెల 4, 22 తేదీల్లో నిందితులు ఉయ్యూరులో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో జేబు దొంగతనాలు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి రూ.20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.



 గట్టి నిఘా

 పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు అన్ని రకాల చోరీలపై గట్టి నిఘా పెట్టినట్టు డీసీపీ కాళిదాస్ తెలిపారు. పలు కేసుల్లో నిఘా పెట్టి నిందితుల అరెస్టుతో పాటు భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ అభినందించారని, రివార్డులు కూడా అందజేయనున్నట్లు డీసీపీ చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top