తెప్పలపై వినాయకుని విహారం


పూతలపట్టు : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారి బ్ర హ్మోత్సవాల్లో చివరిదైన తెప్పోత్సవం గురువారం రా త్రి అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శన మిచ్చారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున వేద పండితులు  మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.



అనంతరం చందనాలంకరణచేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణచేసి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. మంగళవాయిద్యాల మధ్య స్వామివారిని సర్వంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.



జై వినాయక జైజై వినాయక నామస్మరణతో కాణిపాక క్షేత్రం మార్మోగింది. తెప్పోత్సవ కార్యక్రమానికి పుండరీక నాయుడు, శేషాద్రి నాయుడు ఆయన సోదరులు, దామోదరనాయుడు, హనుమంత నాయుడు, రామకృష్ణారెడ్డి కుమారులు, కొత్తపల్లె దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, లంకిపల్లె మోహన్‌బాబు ఆయన సోదరులు ఉభయదార్లుగా వ్యవహరించారు. ఈ వేడుకలో ఈవో పూర్ణచంద్రరావుతోపాటు ఆలయ సిబ్బంది ఈఈ వెంకట్‌నారాయణ, ఏసీ వెంకటేష్,  ఏఈవోలు ఎన్‌ఆర్ కృష్ణారెడ్డి, ఎస్‌వీ. కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

 

వినాయకుని మహాప్రసాదం వేలం



వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 కిలోల లడ్డూ ప్రసాదాన్ని గురువారం రాత్రి బహిరంగ వేలం వేశారు. 21రోజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి మూలవిరాట్ వద్ద నైవేద్యంగా ఉంచిన లడ్డూ ప్రసాదానికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో బహిరంగ వేలం వేశారు.

 

ముగిసిన బ్రహ్మోత్సవాలు



వినాయకస్వామివారి ఆలయంలో ఆగస్టు 29న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి తెప్పోత్సవంతో విజయవంతంగా ముగిశాయి. 9 రోజుల పాటు దేవస్థానంవారు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తరువాత 11 రోజులు ఉభయదార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి  స్వామివారి వాహనసేవలు నిర్వహించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top