బ్రాందీ కోసం గాంధీ మాయం..!


సాక్షి, గుంటూరు:   బ్రాందీ షాపు ముందు గాంధీ విగ్రహం ఉండడంపై విమర్శలు రావడంతో గాంధీ విగ్రహాన్నే అక్కడ లేకుండా చేసేశారు. బార్ షాపు యజమానులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో తమ చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే గాంధీని మాయం చేయగలిగారు. జాతిపిత విగ్ర హం అని తెలిసినా అధికారులు ఏమాత్రం ఆలోచించలేదు. గాంధీ విగ్రహాన్ని తీసుకువెళ్లి ఆయన పేరుతోనే ఏర్పాటు చేసిన గాంధీ పార్కులో ఉంచారు.

 

  సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని పట్టాభిపురం జూట్‌మిల్లు పక్కనే ఉన్న ఓ బార్ షాపు ఎదురుగా అనేక ఏళ్లుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. విగ్రహం ఎదురుగా బార్‌షాపు ఎలా అనుమతిస్తారంటూ అనేకసార్లు స్థానికులు ఆందోళనకు సైతం దిగారు. అయితే రాజకీయ అండదండలు ఉన్న సదరు బార్‌షాపు యాజమాన్యం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు తీశారో ఏమో తెలియదుగానీ గాంధీ విగ్రహాన్ని తొలగించేశారు. రెండు మూడు రోజులుగా గాంధీ విగ్రహం మాయమవడంపై స్థానికులు గందరగోళానికి గురై ఆరా తీయగా నగరపాలక సంస్థ అధికారులే దాన్ని తొలగించినట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. అదేమని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు ఆదే శాలను అనుసరించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే గాంధీ విగ్రహాన్ని తొలగించామని చెబుతుండడం గమనార్హం.

 

 మార్చి నెల 24వ తేదీన గాంధీ విగ్రహంతో పాటు నగరంలో మరో 20 విగ్రహాల వరకూ తొలగించామని వారు చెబుతున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా మారిందనే నెపంతో బార్ షాపు యజమానులతో కుమ్మక్కై ఎవ్వరికీ చెప్పకుండా తొలగించడంపై స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. గాంధీ విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం స్పందించి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ విషయంపై నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top