రాష్ట్రంలో 50 వేల కోట్లతో జాతీయ రహదారులు: గడ్కరీ

రాష్ట్రంలో 50 వేల కోట్లతో జాతీయ రహదారులు: గడ్కరీ


సాక్షి,విజయవాడ:

 రాష్ర్టం ప్రభుత్వం భూసేకరణ చేసి, సమగ్రమైన నివేదిక  (డీపీఆర్)తో ముందుకొస్తే, రాష్ట్రంలో  రూ.50,560 కోట్ల వ్యయంతో 3092 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారులు శాఖల మంత్రి నితిన్ గడ్కరీ  ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు.

 

 జాతీయ రహదారుల శాఖ  రాష్ర్ట రోడ్డు, భవనాల శాఖల సమ్వనయంతో విజయవాడ సమీపంలో 447.88 కోట్లతో దుర్గగుడి వద్ద ఆరులైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, 5.122 కి.మీ నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి చండ్రగూడెం వరకు గల ఎన్‌హెచ్ 30ని రెండు లైన్లతో పునః నిర్మాణం, కత్తిపూడి నుంచి కాకినాడ బైపాస్ సెక్షన్ వరకు 26.15 కి.మీ. ఎన్.హెచ్ 216ను నాలుగు లైన్ల పునః నిర్మాణం పనులను శంకుస్థాపన చేశారు.

 

 అంతకు ముందు బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్‌కు, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ గతంలో రోజుకు రెండు కి.మీ మాత్రమే జాతీయ రహదారులు నిర్మాణం జరిగేదని ప్రస్తుతం 18 కి.మీ చొప్పున నిర్మిస్తున్నామని, వచ్చే మార్చినాటికి 30 కి.మీ చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

 

 విజయవాడ చుట్టూ 150 నుంచి 200 కి.మీ వేగంతో వెళ్లేందుకు వీలుగా 180 కి.మీ 8 లైన్ల అవుటర్ రింగ్ రోడ్డును రూ.20 వేల కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. గతంలో తాము  ముంబాయి నుంచి పూనేకు ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించడం వల్ల 9 గంటల్లో వెళ్లే ప్రయాణం గంటన్నరలోగా వెళ్లిపోతున్నారని వివరించారు. విజయవాడలో జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తామని వెల్లడించారు.

 

 ఈ నెల 19 న ఎయిమ్స్‌కు శంకుస్థాపన

 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ త్వరలోనే భూసేకరణ చేసి, బ్లూప్రింట్‌తో వస్తామని నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని కోరారు. సమావేశంలో కేంద్ర పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన రాష్ర్టం ఇక  బీద అరుపులు అరవాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో శక్తివంతమైన రాష్ట్రంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలను కేంద్ర మంజూరు చేసిందని ఈ నెల 19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) అధ్యక్షత వహించగా, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top