సీఎంల అహంకారంతోనే ప్రజలకు ఇబ్బందులు

సీఎంల అహంకారంతోనే ప్రజలకు ఇబ్బందులు - Sakshi


శ్రీశైలం జలాల వివాదంపై గడికోట ధ్వజం

చంద్రబాబు, కేసీఆర్‌లు కూర్చుని మాట్లాడుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు


 

సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరి అహంకారంతోనే ఉభయ రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉత్పన్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజ మెత్తింది. ఇద్దరు ముఖ్యమంత్రులూ ముందుగానే కూర్చుని మాట్లాడుకుని ఉంటే శ్రీశైలం జలాల వివాదం ఇంత దూరం వచ్చి ఉండేది కాదని పార్టీ శాసనసభాపక్షం కో ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 885 అడుగుల మేరకు ఉన్నప్పుడు, పై నుంచి ప్రవాహం ఆగిపోయిన ప్పుడే చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావు పరస్పరం సంప్రదింపులు జరుపుకుని నీటి వినియోగంపై ఒక కార్యాచరణ రూపొందించి ఉండాల్సిందని శ్రీకాంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

 

 ఇద్దరు సీఎంలు, రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారులంతా హైదరాబాద్‌లో ఉండి కూడా రాష్ట్ర విభజన వల్ల తలెత్తే ఇలాంటి సమస్యలపై ఆలోచించక పోవడం దారుణమని అన్నారు. శ్రీశైలంలో గత ఏడాది ఇదే రోజున 881 అడుగుల మేరకు నీరుందని, ఇప్పుడు మాత్రం నీటిమట్టం 856 అడుగులకు తగ్గిపోయిందని అన్నారు. రాయల సీమ ప్రాజెక్టులకు నీరు అందాలంటే 854 అడుగుల మేరకు మట్టం ఉండాలని పేర్కొంటూ.. ఆ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి తాగునీరు కూడా లభించని పరిస్థితి ఉందని తెలిపారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు. నీరు అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్న టీడీపీ ప్రభుత్వం.. చివరి దశకు వచ్చాక బోర్డుకు లేఖ రాశామని కంటితుడుపు చర్యగా మాట్లాడుతోందని విమర్శించారు. ప్రస్తుతం ప్రతిరోజూ 900 మెగావాట్ల విద్యుత్‌ను శ్రీశైలం జలాశయం నుంచి ఉత్పత్తి చేస్తున్నందున 3 నుంచి 4 టీఎంసీల నీరు వృథాగా కిందకు పోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నీరు పోకుండా తక్షణం ఆపాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top