ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధుల గోల్‌మాల్ !


 రిమ్స్‌క్యాంపస్: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్.ఆర్.హెచ్.ఎం) నిధులంటే చాలు కోట్లాది రూపాయలు కళ్ల ముందు కనిపిస్తాయి. మరి ఆ సొమ్ము ఖర్చు మన చేతుల్లో ఉండడంతోపాటు ఉన్నతాధికారుల అండ ఉంటే...ఇంకేముంది ఎచెక్కా కొల్లగొట్టడం ఖాయం. ఇదే ఆలోచన వైద్య ఆరోగ్యశాఖలోని కొంతమంది అధికారులకు కలిగింది. ఎన్.ఆర్.హెచ్.ఎం నిధుల్లో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఈ నిధులు సక్రమంగా సద్వినియోగం చేశారా అని తెలుసుకోవడం కోసం ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకూ జరిగిన స్టాటిట్యురీ టీమ్ ఆడిట్ కూడా అంతా మాయాజాలంగానే సాగినట్టు సమాచారం. చేయని ఆడిట్‌ను చేసినట్టు చూపేందుకు పీహెచ్‌సీకి రూ. 2,000 చొప్పున, అసలు ఆడిట్ చేయకుండా ఉండేందుకు పలు పీహెచ్‌సీలకు రూ. 2,500 చొప్పున వసూలు చేశారు. ప్రస్తుతం వైద్యశాఖలో దీనిపై సర్వత్రా చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

 

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటన్నింటికీ ఏటా ఎన్.ఆర్.హెచ్.ఎం నిధులు వివిధ రకాలుగా కోట్లాది రూపాయలు వస్తుంటాయి. హెచ్‌డీఎస్ నిధులు, ఎన్యూవల్ మెంటేనన్స్ గ్రాంట్ (ఏఎంజీ), ఆర్‌సీహెచ్-2 ఏఎన్‌ఎమ్‌ల వేతనాలు, డీఎంహెచ్‌వో కార్యాలయానికి మౌలిక వసతుల కల్పనకు, సబ్ సెంటరు అన్‌టైడ్ ఫండ్, శానిటేషన్ ఫండ్ ఇలా వివిధ రకాల నిధులు ఎన్.ఆర్.హెచ్.ఎం కింద విడుదల అవుతుంటారుు. ఈ ఏడాది కూడా సుమారు రూ. ఐదు కోట్లు వరకు నిధులు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ నిధుల ఖర్చులో కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్టు తెలిసింది. అన్నీ నకిలీ బిల్లులు, నకిలీ ఆడిట్‌తోనే ఈ మాయజాలం సాగినట్టు సమాచారం. ఆర్‌సీహెచ్-2 ఏఎన్‌ఎంల వేతనాలకు సంబంధించి విడుదలయ్యే నిధుల మినహా మిగిలిన నిధులన్నింటిలో కూడా అవకతవకలు చోటుచేసుకున్నట్టు భోగట్టా.

 

 నిధుల దుర్వినియోగమిలా..

 ఎన్.ఆర్.హెచ్.ఎం నిధులకు సంబంధించి ముఖ్యంగా హెచ్‌డీఎస్ నిధులు, ఎన్యూవల్ మెంటేనన్స్ నిధులు, సబ్‌సెంటరు అన్‌టైడ్ ఫండ్, శానిటేషన్ ఫండ్‌లో ఎక్కువ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. హెచ్‌డీఎస్ నిధులకు మెడికల్ ఆఫీసర్, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లకు (ఎస్పీహెచ్‌వో) డ్రాయింగ్ పవర్ ఉంటుంది. ఎస్పీహెచ్‌వోలకు కొంత కమీషన్ ఇచ్చి ఈ నిధుల్లో మరికొంత మొత్తాన్ని కొందరు మెడికల్ ఆఫీసర్లు గోల్‌మాల్ చేస్తుంటారు. ఎన్యూవల్ మెంటేనన్స్ గ్రాంట్‌కు సంబంధించి కేవలం మెడికల్ ఆఫీసర్ ఒక్కరికే డ్రాయింగ్ పవర్ ఉంటుంది. కొంతమంది మెడికల్ ఆఫీసర్లు ఈ నిధుల్లో దర్జాగ తమ చేతివాటాన్ని చూపిస్తుంటారు. సబ్ సెంటర్ అన్‌టైడ్ ఫండ్‌కు సంబంధించి ఏఎన్‌ఎం, పీహెచ్‌ఎన్‌లకు డ్రాయింగ్ పవర్ ఉంటుంది. అయితే కొంతమంది మెడికల్ అధికారులు వీరితో కుమ్మకై ఈ నిధుల్లో కూడా కొంత మొత్తాన్ని గోల్‌మాల్ చేస్తుంటారు. శానిటేషన్ ఫండ్ పరిస్థితి కూడా అంతే. దీనికి పంచాయతీ సెక్రటరీ, ఏఎన్‌ఎంలకు డ్రాయింగ్ పవర్ ఉంటుంది. దీంట్లో కూడా చేతివాటం తప్పటం లేదు.

 

 హెచ్‌డీఎస్ కమిటీ అమోదం లేకుండానే...

 హెచ్‌డీఎస్ నిధులకు సంబంధించి మెడికల్ ఆఫీసర్, ఎస్పీవోలకు డ్రాయింగ్ పవర్ ఉన్నప్పటికీ హెచ్‌డీఎస్ కమిటీ అమోదం తప్పనిసరి. అయితే కనీసం ఈ కమిటీకి ఎంత నిధులు ఖర్చు అయ్యావనే విషయం తెలియని పరిస్థితి. కమిటీలో ఎంఆర్‌వో, సర్పంచ్, డ్వాక్రా మహిళ, వార్డు మెంబరు, జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీడీవో ఇలా కొంత మంది సభ్యులుంటారు. హెచ్‌డీఎస్ నిధుల నుంచి ఏయే మందులు కొనుగోలు చేశారు, ఇంకా ఏ పనులకు వాడుతున్నారు అన్నదానిపై ఈ కమిటీ తమ అమోదం తెలపాలి. అయితే కమిటీ అమోదం తెలిపిన దాఖలులు ఎక్కడా లేదు. ఎందుకంటే అసలీ కమిటీ సమావేశాలే జరగవు కనుక. కమిటీ సభ్యులకు ఇవేవి తెలియక తమకేమీ పట్టనట్టు నిమ్మకుండిపోతున్నారు. ఇదే అదునుగా కొంత మంది మెడికల్ ఆఫీసర్లు, ఎస్పీహెచ్‌వోలు కుమ్మకై మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ బిల్లులు పెట్టి నిధులు గోల్‌మాల్ చేస్తున్నారు. దీంతో బిల్లులో ఉన్న మందులు పీహెచ్‌సీల్లో ఉండడం లేదు.

 

 వసూళ్ల పర్వంతో ఆడిట్ మాయజాలం

 పీహెచ్‌సీకి రెండు వేల రూపాయల చొప్పున వసూళ్లు చేయటంతో ఆడిట్‌లో మాయజాలం చోటుచేసుకుంది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరిగిన స్టెటీట్యూటరీ ఆడిట్ అంతా పచ్చనోట్ల వెనకే సాగినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆడిట్ జరిగితే నిధుల దుర్వినియోగం బయటపడుతుందన్న ఉద్దేశంతో కొంతమంది వసూళ్ల పర్వానికి తేరలేపినట్టు సమాచారం. గతంలో జరిగిన పీహెచ్‌సీలను విడిచిపెడితే ఈ నెలలో జరిగిన ఆడిట్‌లో 40 పీహెచ్‌సీలు, పలాస సీహెచ్‌సీ, టెక్కలి ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే చూసీచూడనట్టు ఆడిట్ జరిపినందుకు రూ. 2,000 వసూలు చేశారు. కొన్ని పీహెచ్‌సీలకైతే అసలు ఆడిట్ చేయకుండా ఉండేందుకు రూ. 2,500 వసూలు చేశారు. కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే అవకతవకలు జరుగుతుంటాయని, కాని అన్ని పీహెచ్‌సీల వారి నుంచి డబ్బులు వసూలు చేయటం ఎంత మాత్రం సరికాదంటూ కొంత మంది వైద్యాధికారులు ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్.ఆర్.హెచ్.ఎం నిధుల గోల్‌మాల్ కోట్ల రూపాయల్లో ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top