పోలీసుల పనితీరు భేష్


  • గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ

  • కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరు ఎంతో సంతృప్తి  కలిగించిందని  ఎస్పీ జె.ప్రభాకరరావు స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది, ప్రజలు, అధికారుల సహకారంతోనే జిల్లాలో శాంతిభద్రతలను అనుకున్న మేరకు అదుపులో ఉంచగలిగామని, శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని అందరినీ అభినందించారు. జిల్లా నుంచి ఇటీవల కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ అయిన ఎస్పీ ప్రభాకరరావుకు జిల్లా ఆర్మ్‌డ్ అండ్ రిజర్వ్ సిబ్బంది ఆర్‌ఐ కృష్ణంరాజు నేతృత్వంలో శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గౌరవ సూచికంగా కవాతు నిర్వహించారు.   



    కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తొలుత ఏఆర్ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు.  ఎస్పీ మాట్లాడుతూ జిల్లాతో తనకు గతంలోనే అనుబంధం ఉందన్నారు. అయితే జిల్లాలో ఆనాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎంతో వ్యతాసం ఉందన్నారు. 1994లో బందరు డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన తాను తిరిగి ఇదే జిల్లాలో ఎస్పీగా పనిచేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.



    రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సిబ్బంది పనితీరు ప్రశంసనీయమైందని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావీయకుండా సిబ్బంది చూపిన చొరవ ముదావహమని కొనియాడారు. సిబ్బంది స్థితిగతులను పరిగణలోకి తీసుకున్న తాను వారి సంక్షేమానికి తన వంతు కృషి చేశానన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి నిధులు సంవృద్దిగానే విడుదల అవుతాయని అయితే వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే బావుంటుందని  సూచించారు.



    భవిష్యత్తులో మరలా అవకాశం వస్తే జిల్లాకు మరిన్ని సేవలను అందించేందుకు విశేష కృషి చేస్తానని ఆయన తెలిపారు. అడిషనల్ ఎస్పీ బిడివి.సాగర్ మాట్లాడుతూ ఎస్పీగా ప్రభాకరరావు జిల్లాలో తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందగలిగారన్నారు.  విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వాటిని సవాళ్లుగా తీసుకున్న ఆయన సిబ్బంది విషయంలో పక్షపాతిగానే వ్యవహరించారని చెప్పారు.  



    ఇదే తరహాలో కాకినాడలోనూ విధులను నిర్వర్తించి సమర్థవంతమైన అధికారిగా ఉన్నతాధికారుల మన్ననలు అందుకుంటారని ఆశిస్తున్నామన్నారు.  బందరు డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఓఎస్‌డీ ఆర్.వృషికేశవరెడ్డి, ఆర్మ్‌డ్ అండ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణంరాజు, నాగిరెడ్డి, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top