రేపటి నుంచి ‘బడి పిలుస్తోంది’


  •      జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి

  •      ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని ఆదేశం

  • నర్సీపట్నం టౌన్: బడివయసు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించేందుకు ఉద్దేశించిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం శుక్రవారం నుంచి జిల్లాలో అమలుకానుందని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం నర్సీపట్నం విచ్చేసిన సందర్భంగా జెడ్పీ హైస్కూల్లో విలేకరులతో మాట్లాడారు. ఆరు నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు జిల్లాలో 1900 మంది ఉన్నట్లు ఇప్పటికే గుర్తించామని, వీరందరినీ బడిలో చేర్పించాలని హెచ్‌ఎం, ఉపాధ్యాయులను ఆదేశించినట్లు చెప్పారు.



    ఓ విద్యార్థి చదువు మధ్యలో మానేస్తే తొలుత అతని తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. అప్పటికీ విద్యార్థిని స్కూలుకు పంపకుంటే ఉపాధ్యాయులే అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ జరిపి అతనిని పాఠశాలలో చేర్పించాలన్నారు. బడిపిలుస్తోంది కార్యక్రమానికి జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీపీ అధ్యక్షులుగా ఉంటారని చెప్పారు. సమయానికి బడికి రావడం ఉపాధ్యాయులు అలవాటుగా మార్చుకోవాలని చెప్పారు. కశింకోట పాఠశాలను  తనిఖీ చేయగా ఇద్దరు ఉపాధ్యాయులు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించామని, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

     

    విశాఖ నగరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించిన ప్రైవేటు సంస్థ సక్రమంగా నిర్వహించక పోవడంతో వేరొకరికి అప్పగించినట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో మంచినీరు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు.  పది రోజుల్లో ఈ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు. జిల్లాలోని 1054 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి 25 దరఖాస్తులు అందాయని, వీటిలో 11 పేర్లు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ఇన్‌స్పైయిర్‌ను ఆగస్టు 10వ తేదీలోగా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలను ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నామని తెలిపారు. విద్యతోపాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఈఓ తెలిపారు.  

     

    ఉన్నత పాఠశాల తనిఖీ

     

    నర్సీపట్నం వచ్చిన డీఈఓ కృష్ణారెడ్డి ఇక్కడి జిల్లాపరిషత్ హైస్కూల్ (మెయిన్)ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం ముద్దవ్వకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో హెచ్‌ఎం లక్ష్మణరావు, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీప పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థులుంటే ఇక్కడెందుకు తగ్గుతున్నారని ప్రశ్నించారు. చదువు ఒక్కటే కాదని విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చేయాలని సూచించారు. గత ఏడాది టెన్త్‌లో 55 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలుసుకుని ‘ఇదే మీ పనితీరుకు నిదర్శనం’ అంటూ సున్నితంగా హెచ్చరించారు.



    తొమ్మిదో తరగతిలో ఆరుగురు విద్యార్థులు రాకపోవడంపై ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. అతనితోపాటు హెచ్‌ఎం ఏదో సర్దిచెప్పాలని ప్రయత్నించగా ‘సాకులు చెప్పవద్దని, పనిచేసి చూపించాలని’ ఆదేశించారు. ఉపాధ్యాయులతోపాటు హెచ్‌ఎంకు షోకాజ్‌లు జారీ చేయాలని ఎంఈఓ దివాకర్‌ను ఆదేశించారు. నోటీసులకు సరైన కారణాలు చెప్పకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top