నేటి నుంచి ‘జన్మభూమి-మా ఊరు’


విజయవాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

 

మార్గదర్శక సూత్రాలను విడుదల చేసిన ప్రణాళికా శాఖ

సంతృప్త స్థాయిలో పింఛన్లు వద్దు

అనర్హులకు ఇస్తే సంబంధిత అధికారి నుంచి వసూలు

స్వర్ణ గ్రామానికి పంచ సూత్రాలు, పసిడి పట్టణానికి పంచ సూత్రాలు

గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో సర్వేలు


 

 హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం నేడు ప్రారంభంకానుంది. రాష్ర్టవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జన్మభూమి నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, పేదరికంపై గెలుపు, నీరు-చెట్టు పథకాలను కూడా ప్రారంభిస్తారు. ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి సంబంధించి ప్రణాళికా శాఖ 38 పేజీలతో కూడిన మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమం నిర్వహణకు ఏకంగా రూ.50 కోట్లు వ్యయం చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాకో కోటి రూపాయల చొప్పున 13 జిల్లాలకు రూ.13 కోట్లు  విడుదల చేశారు.



దీనికి అదనంగా పశు వైద్య శిబిరాలు, వైద్య శిబిరాలతోపాటు పంచాయతీరాజ్, మున్సిపల్, వ్యవసాయ శాఖల కార్యకలాపాలకు రూ. 37 కోట్లు విడుదల చేశారు.  ప్రధానంగా ఈ కార్యక్రమంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అయితే అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికే పింఛన్లు ఇవ్వాలని, అర్హులందరికీ పింఛన్ మంజూరు చేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వద్దని స్పష్టం చేశారు. ఎవరికైనా అనర్హులకు పింఛన్లు మంజూరుచేస్తే సంబంధిత అధికారినుంచి వ సూలు చేయనున్నట్లు హెచ్చరించారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, పదవీ విరమణ చేసిన ఆర్టీసీ సిబ్బందికి పింఛన్ మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కొత్తగా పింఛన్ల కోరుతున్నవారికి చెందిన ఆర్థిక కార్యకలాపాలతోపాటు పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని రూపొందించారు. ‘స్వర్ణ గ్రామానికి పంచ సూత్రాలు’ పేరుతో గ్రామాల విజన్‌ను, ‘పసిడి పట్టణానికి పంచ సూత్రాలు’ పేరుతో మున్సిపాలిటీల విజన్‌ను రూపొందించనున్నారు. ఈ కార్యక్రమంలో పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, నీరు-చెట్టు, స్వచ్ఛ ఆంధ్రా నినాదాలతో ప్రచారం చేయనున్నారు.



ఎన్టీఆర్ ఆరోగ్య సేవ లబ్ధిదారులందరి నుంచి ఆధార్ నంబర్‌ను, రేషన్ కార్డు, సెల్‌ఫోన్ నంబర్లను సేకరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ అంశాలపై గ్రామాల్లోను, మున్సిపాలిటీల్లోను సర్వేలను కూడా నిర్వహించనున్నారు. ఈ సర్వేల్లో భాగంగా నిరుద్యోగులు, రోడ్లు, డంప్ యార్డులు, డ్రైనేజీ, పాఠశాలలు, మంచినీటి సౌకర్యం వివరాలను సేకరించనున్నారు. అలాగే నీరు-చెట్టు కింద గ్రామ పంచాయతీల్లో నీటి నిల్వ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏ స్థితిలో ఉన్నాయో కూడా సేకరిస్తారు.

 

మంత్రులు, అధికారులంతా జన్మభూమిలోనే...



మంత్రులు, అధికారులంతా జన్మభూమిలోనే పూర్తిగా నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. బుధవారం కేబినెట్ సమావేశంలో ఆయన జన్మభూమిపై సుదీర్ఘంగా చర్చ సాగించారు. మంత్రులు జన్మభూమి సాగినన్ని రోజులు తమతమ జిల్లాల్లోనే ఉండాలని, హైదరాబాద్‌కు రావద్దని స్పష్టంచేశారు. తాను రోజుకో జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. పెన్షన్లను అయిదురెట్లు పెంచ డాన్ని, ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్న అంశాలను, రైతులు, మహిళలకోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు తదితరాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. అక్టోబర్ ఆరోతేదీన రాజధాని కమిటీ సమావేశమున్న అంశాన్ని మంత్రి నారాయణ ప్రస్తావించగా... ఆ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పారు. పెన్షన్లు, రుణాల మాఫీ వంటి అంశాలు మినహా మంత్రులు ఇంకే అంశంపైనా మాట్లాడరాదని ఆదేశించారు. జన్మభూమిలో ఎక్కడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలు ఎదురుకాకుండా మంత్రులు ప్రతిరోజూ సమీక్ష చేసుకోవాలని, ఎక్కడ ఏ సమస్య ఎదురైనా వెంటనే వాటిని సర్దుబాటుచేసుకోవాలని ఆయన సూచించారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top