నేటి నుంచి వైఎస్సార్ సీపీ పోరుబాట

నేటి నుంచి వైఎస్సార్ సీపీ పోరుబాట - Sakshi

  • రుణమాఫీపై పరిమితులకు నిరసన

  •  నరకాసుర వధ పేరిట ఆందోళన

  •  చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం

  •  ధర్నాలు, రాస్తారోకోలు,మానవహారాలు

  • సాక్షి, విశాఖపట్నం : రైతు, డ్వాక్రా రుణాల్ని మాఫీ చేస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. హామీ అమలుకు పరిమితులు విధించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు గ్రామగ్రామాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ వెల్లడించారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా ‘నరకాసుర వధ’ పేరిట గురు, శుక్ర, శనివారాల్లో ధర్నా, రాస్తా రోకో, మానవహారం తదితర కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు దిష్టి బొమ్మల్ని దహనం చేయనున్నట్టు తెలిపారు.

     

    ఎన్నికల ముందు తెలియదా?



    ‘ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన తేదీ ఖరారు చేశారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులేంటో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలుసు. అన్నీ తెలిసీ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.87,612 కోట్లు రైతు రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలు వెరసి మొత్తం రూ.1,01,816 కోట్లు రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చి ఇపుడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నా’రంటూ బొడ్డేడ ప్రసాద్ ధ్వజమెత్తారు.



    తెలంగాణాలో రుణమాఫీ అమల్లో పరిమితులపై ఓ మంత్రి మాట్లాడితే అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మల్ని దహనం చేసిన టీడీపీ నేతలు, ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీపై మాట తప్పడాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రమాణ స్వీకారం రోజే రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు మాట తప్పారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి తదితర హామీల్ని తుంగలో తొక్కడం ఖాయమని మండిపడ్డారు.



    చంద్రబాబు దిగజారుడుతనాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే మూడు రోజుల నరకాసుర వధ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. జిల్లాలోని పార్టీ శ్రేణులన్నీ నియోజకవర్గాల వారీ గ్రామగ్రామాన ఉద్యమించేందుకు సిద్ధం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు ఉద్యమానికి సారథ్యం వహించాలన్నారు.



    జిల్లాలోని అన్ని మండల, పంచాయతీ కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరారు. రైతులున్న ప్రతి చోటా ఆందోళన కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గాల వారీ బాధ్యతలు అప్పగించామన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం చింతపల్లిలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విలేకరులకు తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top