మాజీ మంత్రి ‘భాట్టం’ కన్నుమూత

మాజీ మంత్రి ‘భాట్టం’ కన్నుమూత


* అనారోగ్యంతో విశాఖలో మృతి

* పలువురు ప్రముఖుల సంతాపం


సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ భాట్టం శ్రీరామ్మూర్తి (89) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరం జిల్లా ధర్మవరంలో 1926 మే 12న జన్మించారు.



భారత సోషలిస్టు పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1957లో ఆ పార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 16 ఏళ్ల పాటు ఏఐసీసీ సభ్యునిగా కొనసాగారు. 1962 నుంచి 1981 వరకు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. విద్య, సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమం, సాంకేతిక విద్య, హరిజన, గిరిజన సంక్షేమం, యువజన సర్వీసులు, దేవాదాయ, ప్రత్యేక ఉపాధి పథకాలు, సాంస్కృతిక వ్యవహారాల శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1984లో టీడీపీ తరఫున విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను అధిరోహించిన ఆయన వివాదరహితునిగా పేరొందారు.



చాన్నాళ్లుగా భాట్టం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తొలినాళ్లలో శ్రీరామ్మూర్తి జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1947-48లో జయభారత్ మ్యాగ్‌జీన్‌కు ఉప సంపాదకునిగా, 1969 నుంచి కొన్నేళ్లు ప్రజారథం వారపత్రిక, ఆంధ్ర జనతా (హైదరాబాద్ నుంచి వెలువడే) దినపత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. స్వేచ్ఛా భారత్ పేరుతో స్వీయ చరిత్రతో పాటు తెలుగులో నాలుగు పుస్తకాలు రాశారు. సాంస్కృతిక రంగంలో చేసిన కృషిని గుర్తించి 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాట్టంకు కళారత్న పురస్కారాన్ని అందజేసింది.



సోమవారం సాయంత్రం శ్రీరామ్మూర్తికి విశాఖ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భాట్టం మృతికి సీఎం చంద్రబాబు , జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.

 

వైఎస్ జగన్ సంతాపం

సాక్షి, హైదరాబాద్: ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, రాష్ట్ర మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి మృతికి  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన భాట్టం సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉండటమే కాక, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన సంప్రదాయాలను నెలకొల్పారని జగన్ కొనియాడారు. భాట్టం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top