వాతావరణ బీమా.. ఎగ్గొట్టేదామా!

వాతావరణ బీమా.. ఎగ్గొట్టేదామా! - Sakshi


► అందరికి ఇవ్వలేమంటున్న బీమా అధికారులు

► సర్దుబాటుధోరణిలో వ్యవసాయాధికారులు

► రైతులకు మరోసారి మొండిచేయి!




మూడేళ్లుగా వాతావరణ బీమా పరిహారం అందకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న రైతులకు మరోసారి అన్యాయం జరగబోతోంది. తాజాగా పరిహారం విషయంలో రకరకాల కొర్రీలతో ఎగనామం పెట్టాలని అటు బీమా సంస్థ చూస్తుండగా, అధికారులు ఏం చేయలేక మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. బ్యాంక్‌లో రుణాలు తీసుకున్న వివరాలకు, రెవెన్యూ రికార్డుల వివరాలకు తేడాలు ఉన్నాయని, అందరికి పరిహారం ఇవ్వలేమని ఓ ప్రైవేట్‌ బీమా కంపెనీ చేతులెత్తేసినట్లు తెలిసింది. దీంతో వ్యవసాయాధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.



వేంపల్లె : 2016 వాతావరణ బీమాపై సందిగ్ధత నెలకొంది. ఇటీవల ప్రభుత్వం, బీమా కంపెనీలు కుమ్మక్కై ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తామని ప్రకటన చేసి రహస్య ఆదేశాలు జారీచేయడంతో విషయం తెలుసుకున్న ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారంరోజులు గడువు ఇచ్చి రెండు ఇవ్వకపోతే ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని ప్రకటన ఇవ్వడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. రెండు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా ప్రకటించారు.



ఇది బయటపడిన తర్వాత బీమా కంపెనీ రైతులకు ఏదో ఒకవిధంగా బీమా పరిహారానికి ఎగనామం పెట్టే దిశగా పావులు కదుపుతోంది. కేవలం కడప జిల్లాకు రూ.43కోట్లు వాతావరణ బీమా మంజూరైందని చెబుతున్నారే కానీ, వివరాలు ఎవరూ స్పష్టం తెలపడంలేదు. త్వరలో పంపిణీ చేస్తామంటున్నారు కానీ, ఏ మండలానికి ఎంత మంజూరైంది లెక్కలు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.



1.27లక్షల మంది రైతులు

జిల్లాలో ఆయా బ్యాంక్‌ల ద్వారా 1,27,356 మంది రైతులు 2016లో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంట రుణాలను రెన్యువల్‌ చేశారు. దీనికి సంబంధించి వేరుశ నగకు వాతావరణ బీమా చెల్లించారు. వీరందరికీ ఇప్పుడు బీమా చెల్లించాల్సి ఉంది. వీరందరూ ప్రీమియంను ఎకరానికి రూ.320ల లెక్కన కొన్ని బ్యాంక్‌లలోనూ, మరికొన్ని బ్యాంక్‌లలో రూ.10వేలకు రూ.300లు రైతులు చెల్లించారు. ఈ మొత్తం దాదాపు రూ.12కోట్లు ఓ ప్రైవేట్‌ బీమా కంపెనీకి చేరింది.


ఇప్పుడేమో అంతమంది రైతులు ఉన్నట్లు తమ రికార్డులలో లేదని, ఇందులో సగానికి సగం తగ్గించి బీమా అధికారులు లెక్కలు చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో వ్యవసాయాధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 1.26 లక్షలమంది రైతులకు రూ.43కోట్లు సమానంగా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీమా కంపెనీపై ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.



బీమా ప్రీమియం రైతులు చెల్లించిన మొత్తాన్ని ఆ ప్రైవేట్‌ కంపెనీ అంతా తీసుకొని, పరిహారం ఇచ్చే సమయంలో రెండు మాటలు మాట్లాడటం వల్ల అంతా గందరగోళంగా తయారైంది. ఇటీవలే రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లె, రాయచోటి మండలాలకు రూ.10 వేల నుంచి రూ.12వేలు ఎకరానికి వాతావరణ బీమా మంజూరైందని చెప్పారు. ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే రైతులందరికీ అన్యాయం జరిగే అవకాశం ఉంది. కేవలం ఒక్కో రైతుకు రూ.3వేల కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఒక్కో రైతుకు 5 ఎకరాలకు సంబంధించి రూ.1,800లు చెల్లించారు.



వాతావరణ బీమా లెక్క ఇలా..

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వాతావరణ బీమా లెక్కలు ఈ విధంగా ఉంటాయి. పంటల చీడ, పీడల నివారణ, వాతావరణంలోని ఉష్ణోగ్రతలు, సగటు వర్షపాతం లెక్కలను తీసుకొని ఆయా మండలాలవారీగా బీమా మంజూరు విషయంలో లెక్కలు వేస్తారు. మండలకేంద్రంలో ఒక వాతావరణ సూచికను కూడా ఏర్పాటు చేసి నేరుగా రాజధాని ప్రాంతానికి వర్షపాత వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఏ మండలానికి ఎంత శాతం వాతావరణ బీమా మంజూరైంది ఏ ఒక్క అధికారి కూడా చెప్పడంలేదు. కారణం బీమా కంపెనీ అడ్డం తిరగడంవల్ల ఈ విషయం బయటకు రాకుండా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



రికార్డుల్లో తేడా అంటూ డ్రామా

బ్యాంక్‌లలో పంట రుణాలు రెన్యువల్‌ చేసేందుకు రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, 1బి, అడంగల్‌ అందించాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా ఇవి మాన్యువల్‌ కాకుండా మీసేవ కేంద్రంలో ఆన్‌లైన్‌లో పొందాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారమే రైతులు బ్యాంక్‌లలో సంబంధిత పత్రాలను అందజేసి ఉంటారు. ప్రస్తుతం ఆ ప్రైవేట్‌ బీమా కంపెనీ రెవెన్యూ రికార్డులకు, బ్యాంక్‌ రికార్డులకు తేడా ఉందని చెప్పి డబ్బులు ఎగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.



ఇందుకు ప్రభుత్వం ఒత్తాసు పలకడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోందని రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రూ.50కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ.43కోట్లు మాత్రమే ఇచ్చారు. గతంలో ప్రభుత్వం బీమా సంస్థ అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ బీమా వ్యవహారాన్ని చూస్తుండగా, గత ఏడాది నుంచి ఆయా జిల్లాల్లో ఒక్కో ప్రైవేట్‌ సంస్థకు వీటిని టెండర్ల రూపంలో ప్రభుత్వం అప్పగించింది. గతంలో ఏఐసీ నిర్వహించేటప్పుడు కూడా రైతులు చిన్న, చిన్న తప్పులను పట్టుకొని బీమా రాకుండా పోయిన సందర్భాలు లేకపోలేదు.

 

అన్యాయం చేస్తే ఉద్యమిస్తాం

రైతులకు అన్యాయం చేస్తే మండల, జిల్లాస్థాయిల్లో ఆందోళన చేస్తాం. బ్యాంక్‌లో పంట రుణాలు రెన్యువల్‌ చేసిన రైతులందరూ బీమా ప్రీమియం చెల్లించారు. మండలాలవారీగా వారికి వచ్చిన బీమాను అందజేయకపోతే ఉద్యమాలు చేసి సాధించి తీరుతాం. – ఎం.మస్తాన్‌రెడ్డి(బీకేఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు), వేంపల్లె



రూ.43కోట్లు బీమా మంజూరు

వాతావరణ బీమా కింద రూ.43కోట్లు బీమా మంజూరైంది. త్వరలో రైతులకు అందజేస్తాం. అయితే ఏ మండలానికి ఏమేరకు మంజూరైన వివరాలు ఇంకా తమకు తెలియరాలేదు. త్వరలో వివరాలు తీసుకొని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – ఠాగూర్‌నాయక్‌ (జేడీఏ), కడప

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top