నలుగురు దొంగలు..48 నేరాలు

నలుగురు దొంగలు..48 నేరాలు


అనంతపురం క్రైం : భారీ ఎత్తున చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠాను సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 36 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు సోమవారం వెల్లడించారు.



పట్టుబడిన వారిలో కదిరి పట్టణం కుటాగుళ్లకు చెందిన పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి, రొద్దం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అలియాస్ శీనా, కంబదూరు మండలం తిప్పేపల్లికి చెందిన ఎరికల గంగన్న అలియాస్ పాచి గంగడు, కంబదూరుకు చెందిన ఎరికల సోమశేఖర్ ఉన్నారు. వీరి నుంచి 1.11 కిలోల బంగారం నగలు, 7 కిలోల వెండి ఆభరణాలు, రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.



ఇదీ ముఠా నేపథ్యం : పట్టుబడిన వారిలో పీట్ల ఆంజనేయులు అలియాస్ అంజి కీలక పాత్రదారి. పందుల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతను తాగుడు, పేకాట, కోడి పందేలు తదితర జూదాలకు అలవాడు పట్టాడు. తాడిపత్రి, గోరంట్ల ప్రాంతాలకు వెళ్లి తరచూ జూదాలు ఆడేవాడు. ఈ క్రమంలో తక్కిన ముగ్గురు నిందితులు ఇతనికి పరిచయమయ్యారు. వీరికున్న వ్యసనాలు, దురలవాట్లు తీర్చుకునేందుకు సరిపడా డబ్బు లేకపోవడంతో దొంగల ముఠాగా ఏర్పడ్డారు.



ఈ ముఠా ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుంటారు. ఎవరూ లేని సమయంలో అదునుచూసి పగలు-రాత్రి తేడా లేకుండా ఇళ్ల తాళాలను పగలకొట్టి లోపలికి ప్రవేశిస్తారు. ఇంట్లో దాచిన విలువైన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్తారు. వీటితోపాటు ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలు, పురుషులను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలు లాక్కెళ్తారు.



ఏడాదిలో 48 నేరాలు : ఏడాదిలో ఈ ముఠా 48 నేరాలకు పాల్పడింది. వీటిలో అధికంగా ఇళ్లకు వేసిన తాళాలు పగలకొట్టి అల్మారా, బీరువాల్లో దాచిన బంగారు, వెండి ఎత్తుకెళ్లిన నేరాలే. అనంతపురం నగరంతో పాటు రాప్తాడు, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, కసాపురం, పాల్తూరు, తాడిపత్రి, కనగానపల్లి, ఉరవకొండ, గోరంట్ల, గుంతకల్లు, లేపాక్షి, గార్లదిన్నె, గుత్తి, కూడేరు, ధర్మవరం, యాడికి, హిందూపురం, తాడిమర్రి, విడపనకల్లు, రాయదుర్గం, కుందుర్పి, పెద్దవడుగూరు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. పీట్ల ఆంజనేయులు మినహా తక్కిన ముగ్గురు నిందితులూ పాత నేరస్తులే. ఎరికల సోమశేఖర్ చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడి రిమాండ్‌కు కూడా వెళ్లొచ్చాడు. ఎరికల గంగన్న గతేడాది కళ్యాణదుర్గం ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకెళ్లొచ్చాడు. శ్రీనివాసరెడ్డి కర్ణాటకలోని వైఎన్‌హెచ్‌కోటలో జరిగిన ఓ దారిదోపిడీ కేసులో నిందితుడు.



ఎస్పీ ఆదేశాలతో ముఠా గుట్టు రట్టు : దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచాలనే ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశాలతో అదనపు ఎస్పీ కె.మాల్యాద్రి పర్యవేక్షణలో సీసీఎస్ డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు జి.రాజశేఖర్, ఆనందరావు, అశోక్‌రెడ్డి, శుభకుమార్, ఎస్‌ఐలు సుబ్బరాయుడు, రవిశంకర్‌రెడ్డి, జి.రాజు, జనార్దన్‌నాయుడు, ఏఎస్‌ఐలు సాదిక్‌బాషా, అంజాద్‌వలి, వరలక్ష్మి సిబ్బందితో బృందాలకు ఏర్పడ్డారు.



ఈ క్రమంలో సీసీఎస్ డీఎస్పీకి పక్కా సమాచారం అందడంతో ఈ బృందాలు స్థానిక జాతీయ రహదారి సమీపంలో కక్కలపల్లిక్రాస్‌లో ముఠా సభ్యులను అరెస్టు చేశాయి. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పలువురికి వ్యక్తిగత రివార్డులు అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top