విషాద జాతర

విషాద జాతర


 పండగవేళ అక్కడ విషాదం వికృత నృత్యం చేసింది... వారి సంతోషాన్ని చంపావతి నది చంపేసింది. గ్రామ దేవత జాతర కోసం వచ్చిన నలుగురిని పొట్టనపెట్టకుని కన్నవారికి కడుపు మంట మిగిల్చింది. నిమిషం ముందువరకూ ఆడు తూపాడుతూ కేరింతలు కొట్టిన ఆ యువకులు విగత జీవులుగా పడి ఉండడంతో ఊరు గొల్లుమంది. అమ్మా, పాదాలమ్మ తల్లీ నీ పండుగ కోసం... నీకు పసుపు కుంకుమలు సమర్పించేందుకు వచ్చాం తల్లీ.. నీకు కనికారం కలగలేదా..మా బిడ్డలను రక్షిం చలేకపోయావా...ఇదేనా నీవు మామీద చూపించే దయ  అంటూ మృతుల తల్లిదండ్రులు, తోబుట్టువులు కటుంబ సభ్యులు నదీ తీరంలో గుండెపగిలేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టింది.  

 

 భోగాపురం : మండలంలోని గరే నందిగాం గ్రామానికి చెందిన కొంతమంది బతుకు తెరువుకోసం కొన్నేళ్ల కిందట విశాఖ వెళ్లారు. వారిలో కొంతమంది ప్రైవేటు కంపెనీల్లో, మరికొంతమంది తాపీమేస్త్రీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.  వీరంతా  విశాఖపట్నం సమీపంలోని  పోతినమల్లయ్యపాలెం వద్ద లక్ష్మివానిపాలెంలో నివాసముంటునన్నారు. అయితే వారు ప్రతీ ఏటా గ్రామంలో ఉన్న   పాదాలమ్మ అమ్మవారి జాతర కోసం గరే నందిగాం వచ్చి పసుపు కుంకుమలు అందిచండం   ఆనవాయితీ. అమ్మవారికి ప్రధమ పూజారులుగా వారు ఉంటూ వస్తున్నారు. గ్రామస్తులు పండగ జరిపే సమయంలో అమ్మవారికి ముందుగా సమర్పించిన బలిని వారికి అందజేసి అనంతరం పండగ నిర్వహిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.

 

 ఈ నేపథ్యంలో సోమవారం గ్రామానికి చేరుకున్న వారంతా మంగళవారం అమ్మవారికి పసుపు కుంకులు సమర్పించి మొక్కులు చెల్లించి జాతర నిర్వహించారు. అలాగే బుధవారం అమ్మవారికి   బలులు సమర్పించి, మధ్యాహ్నం భోజనాలు అనంతరం తిరిగి విశాఖ వెళ్లిపోవాల్సి ఉంది. ఇంటివద్ద పెద్దలు ఆపనిలో నిమగ్నమై ఉండగా సుమారు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పోతిన వెంకట అప్పారావు, బెర్జి మహేష్ (23), గరే శివ (24), పోతిన రాము (25) కొత్తపల్లి రాజేష్ (15)లు గ్రామానికి ఆనుకుని ఉన్న చంపావతి నదిలోకి స్నానానికి వెళ్లారు.   మహేష్, శివ, రాము, రాజేష్ ఒకరి తరువాత ఒకరు నదిలో స్నానానికి  దిగారు.  వారు దిగిన చోట బాగాలోతు ఉన్న విషయం వారికి తెలియదు. దీంతో ఒకరి వెనుక ఒకరు ఆ గుమ్మిలోకి జారిపోయారు. చివరగా ఉన్న వెంకట అప్పారావు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో అతను గ్రామంలోకి పరుగెత్తి విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే వారంతా నది ఒడ్డుకు చేరుకుని మృతదేహాల కోసం గాలించారు. నదీ ప్రవాహ వేగం ఎక్కువగా లేకపోవడంతో దగ్గరలోనే మృతదేహాలన్నీ లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నది ఒడ్డుకు చేరుకున్నారు.

 

 మృతదేహాలను చూసిన వారి దుఃఖం కట్టలు తెంచుకుంది.  ఒక్కసారిగా నదీ తీరం వారి రోదనలతో నిండిపోయింది.   స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐలు దీనబంధు, లోవరాజులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వైఎస్‌ఆర్ సీపీ సిఇసి మెంబరు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఫోనులో బాధిత కుటుంబాలకి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.    విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏఎంసీ మాజీ చైర్మన ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, మాజీ జెడ్‌పిటిసి భెరైడ్డి ప్రభాకరరెడ్డి, సుందర గోవిందరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీనివాస్, పిళ్లా విజయకుమార్, యడ్ల ఆదిరాజు, పడాల శ్రీనువాసరావు, కందుల రఘుబాబు, గరే కాళిదాసు తదితరులు బాధితులను పరామర్శించి,  అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

 

  ఒకే ఇంట్లో ఇద్దరు

 గరే శివ, పోతిన రాము బావమరుదులు. ఏడాదిన్నర క్రితం శివ చెల్లిన పెళ్లాడిన రాముకి ఆరు నెలల పాప ఉంది. దగ్గరి బంధువులైన వీరిద్దరూ ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరిని నది రూపంలో మత్యువు కబళించింది. వీరి మృతితో శివ తండ్రి రామచంద్రరావు, రాము తండ్రి తాత కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

 

 వద్దంటే వెళ్లాడు..

 కాటపల్లి రాజేష్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి ఇటీవల మరణించాడు. అతనికి అక్క, అన్నయ్య ఉన్నారు. తల్లి కుట్టు మెషీన్ ఆధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వద్దన్నా వినకుండా మంగళవారం సాయంత్రం గరే నందిగాంలో గ్రామ దేవత పండక్కి వెళ్లాడు. ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి గుండెలవిసేలా రోదించింది. వ ద్దంటే వెళ్లాడు అందనిలోకాలకు చేరుకున్నాడంటూ విలపిస్తోంది.

 

 ఒక్కగానొక్క కొడుకు దూరం

 విజ్జి కనకరావుకు ఒక్కగానొక్క కొడుకు మహేష్. అతడికి ఒక చెల్లి ఉంది. ఓ కాంట్రాక్టర్ వద్ద పనులు చేస్తున్నాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడ్ని మత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. తమ కుమారుడు ఇకలేడనే వార్త వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. చుట్టుపక్కలవారితో కలుపుగోరుగా ఉండే మహేష్ మతితో స్థానికులు విచారంలో మునిగిపోయారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top