ఏపీలో నాలుగు ఎమ్మెల్సీల ఎన్నికలు ఏకగ్రీవమే


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉప ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గడువు ముగిసే సమయానికి నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత వీరి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి డీసీ గోవిందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేయగా, గురువారం టీడీపీ అభ్యర్థులు ఎంఏ షరీఫ్, కావలి ప్రతిభా భారతి, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. వీరు రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. షరీఫ్, వీర్రాజు సాధారణ కోటా కింద నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిభా భారతి మాత్రం పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు.



అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణకు అందచేశారు. ఇటీవలే టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు పేరును ఖరారు చేసినప్పటికీ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటరుగా నమోదు కాకపోవడంతో పోటీ చేయడానికి వీలులేకపోవడంతో చివరి నిమిషంలో ప్రతిభా భారతి పేరును ఖరారు చేశారు. షరీఫ్, ప్రతిభా భారతిల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి కె. అచ్చాన్నాయుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, కాగిత వెంకట్రావు, గద్దె రామ్మోహన్, వేగుల జోగేశ్వరరావు, అరిమిల్లి రాధాకృష్ణ, బోండా ఉమామహేశ్వరరావు, పులపర్తి నారాయణమూర్తి, వర్మ, టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకట సురేష్, పార్టీ నేతలు ఏఎం రాధాకృష్ణ, రవియాదవ్, బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.



అంతకు ముందు షరీఫ్‌తో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారైన టీడీ జనార్ధనరావును పార్టీ నేతలు ఎన్‌టీఆర్ భవన్‌లో సత్కరించారు. బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేఎల్పీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు వీర్రాజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి ర్యాలీగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరుగుతుంది.



నామినేషన్ల ఉపసంహరణకు సోమవరం వరకూ గడువు ఉంది. అయితే నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయటంతో వారు ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం ప్రకటిస్తారు. నామినేషన్ వేసిన సందర్భంగా షరీఫ్, ప్రతిభా భారతి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామన్నారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనేందుకు తమ ఎన్నిక నిదర్శనమన్నారు. షరీఫ్ సుదీర్ఘకాలంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిభా భారతి గతంలో స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. 2004, 2009 సాధారణ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకమారు ఓటమిని చవి చూశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top