కక్షతోనే చంపేశారు...


వలీ హత్య కేసులో నలుగురు అరెస్ట్

కుమారుడిని చంపేశాడనే అనుమానంతో..

విలేకరులతో సీఐ సదాశివయ్య


 

 చెన్నూరు : కొడుకును చంపి, సంసారంలో జోక్యం చేసుకొని కోడలిని దూరం చేశారనే కక్షతో వలీ(30)ని హుస్సేన్‌బీ అలియాస్ బీబీ(ఈరమ్మ), ఆమె కుమారుడు పెద్దహుస్సేన్ తలపై రోకలిబడెతో కొట్టి, గొంతుకోసి హత్య చేశారని కడప అర్బన్ సీఐ సదాశివయ్య అన్నారు. చెన్నూరులో గురువారం రాత్రి ఎస్ హనుమంతుతో కలిసి విలేకర్ల ఎదుట హంతకులను, హత్యకు ఉపయోగించిన కత్తి, రోకలిబడెలను హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా వినుగొండ మండలం దర్శి గ్రామానికి చెందిన హుస్సేన్‌బీ 15 ఏళ్ల క్రితం వలసవచ్చి చెన్నూరులోని ఎల్లమ్మకాలనీలో ఆవుల వ్యాపారం, భిక్షాటన చేస్తూ జీవిస్తోంది.



ఈమెకు ఖాజీ పేటలోని మైదుకూరు రోడ్డు సమీపంలో నివసిస్తున్న షేక్‌వలీ బంధువు. హుస్సేన్‌బీ రెండవ కుమారుడు నడిపి హుస్సేన్, షేక్‌వలీలు స్నేహితులు. వీరిద్దరు ఖాజీపేటకు బైకులో వెళ్లి తిరిగి హుస్సేన్ ఒక్కడే వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందాడు. వలీనే కుమారుడిని చంపాడని, అలాగే పెద్దకుమారుని భార్య విషయంలో వలీ జోక్యం చేసుకొని కోడలిని దూరం చేశాడని కక్ష పెంచుకొన్నారు.



 పథకం ప్రకారం...

ప్రశ్నించకుండా అతనితో మాట్లాడుతూ ఈ నెల 11న మధ్యాహ్నం వలీని ఇంటికి రమ్మని పెద్దహుస్సేన్ ద్వారా ఫోన్ చేసి పిలిపించారు. పూటుగా మద్యంతాపి, భోజనం తిని మత్తులో ఉండగా హుస్సేన్‌బీ పథకం ప్రకారం తలపై రోకలిబడెతో కొట్టింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న వలీని స్థానికుడైన పోతుబోయిన గంగయ్య సహకారంతో పెద్దహుస్సేన్ కత్తితో గొంతు కోశాడు. రక్తం బయటకు రాకుండా బొంతలు చుట్టారు. యూరియా సంచుల్లో శవం కనపడకుండా ఫ్యాక్ చేశారు.



రాత్రి వరకు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని చీకటి పడ్డాక గంగయ్య, పెద్దహుస్సేన్‌లు వలీ బైకులోనే తీసుకెళ్తుండగా జారిపోవడంతో రోడ్డు పక్కనే మృతదేహాన్ని పడేశారు. కడప బిర్యాని సెంటర్‌లో పని చేస్తున్న బుక్కే శంకర్‌నాయక్ లగేజి ఆటో తీసుకొని కడప నుంచి రాగానే అతన్ని పిలిపించి అర్ధరాత్రి దాటాక ఉప్పరపల్లె రోడ్డు మీదుగా గోపవరం సమీపంలోని కేసీ కాల్వకట్ట పక్కనే పడేశారు.



 కత్తి, రోకలిబడె, వాహనాలు స్వాధీనం...

 12న స్థానికుల సమాచారం మేరకు వీఆర్‌ఓ ఓబయ్య ఫిర్యాదు చేయగా కేసు విచారణ చేపట్టారు. హంత కులిద్దరిని, సహకరించిన వారిని బలసింగాయపల్లె సమీపంలోని కై లాసగిరికోన వద్ద అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి కత్తి, రోకలిబడె, ఆటో, సెల్‌ఫోన్ హత్యకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. శుక్రవారం కోర్టుకు హాజరు పెట్టనున్నట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా పని చేసిన ఎస్‌ఐ హనుమంతు, ఏఎస్‌ఐ అనసూయ, ెహ డ్ కానిస్టేబుళ్లు సతీష్, భాస్కర్‌రెడ్డి, శర్మ, కానిస్టేబుళ్లు నాగరాజు, గంగరాజు, నందకుమార్, ప్రసాద్‌ను అభినందించి రివార్డు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదిస్తున్నట్లు ఆయన వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top