ఐఐటీకి పునాది

ఐఐటీకి పునాది - Sakshi


దీంతోపాటు ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు శంకుస్థాపన

హాజరైన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీ

ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం: బాబు

 


తిరుపతి: రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి పునాదిరాయి పడింది. దీంతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), ట్రిపుల్ ఐటీలకు కూడా శంకుస్థాపన జరిగింది. విభజన  హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతి సమీపంలో, ట్రిపుల్ ఐటీని శ్రీ సిటీ సెజ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఎం.వెంకయ్యనాయుడు శనివారం తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలం జంగాలపల్లి వద్ద శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘తిరుపతిని నాలెడ్జి హబ్‌గా తీర్చిదిద్దుతా. ఆంధ్రప్రదేశ్‌ను అన్నివిధాలుగా నంబర్ వన్ చేసే బాధ్యత తీసుకుంటున్నా. ఇందుకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహకారం ఉంటుంది. చదువుకున్న యువత ఉపాధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. మున్ముందు ఏపీ ఎడ్యుకేషన్ హబ్‌గా మారుతుంది’ అని అన్నారు. విద్యతోపాటు పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామన్నారు. తిరుపతి నుంచి వెంకటగిరి వరకు ఉన్న ప్రాంతాన్ని పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.

 అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే తిరుపతి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దేశాభివృద్ధికి మోదీ నాయకత్వం అవసరమని, పది నెలల్లోనే దేశ ప్రతిష్టను పెంచారంటూ ప్రధానమంత్రిని కొనియాడారు. 



మన మేధ స్సును విశ్వానికి పంచేందుకే : వెంకయ్య



అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలివితేటలను పంచాలనే ఉద్దేశంతోనే  దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఒకేచోట మూడు విద్యాసంస్థలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విద్యార్థులు ఈ సంస్థల్లో  చదువుకుని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆయన కాంక్షించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మాతృ  దేశాన్ని, తెలుగు భాషనూ మరచి పోవద్దంటూ యువతకు హితవు పలికారు. రాష్ట్రంలో ఏడు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను త్వరలో నెలకొల్పుతామన్నారు. దీంతోపాటు రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. మన్నవరం ప్రాజెక్టును సైతం ముందుకు తీసుకెళుతామని హామీ ఇచ్చారు. భూ సేకరణతోఅభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. భూమి కోల్పోయిన రైతులకు నాలుగు రెట్ల పరిహారంతో పాటు అక్కడ నెలకొల్పే సంస్థలో కుటుంబంలో ఓ వ్యక్తికి ఉద్యోగం సైతం వస్తుందన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అందువల్ల కేంద్రం తప్పకుండాసాయం  చేస్తుందన్నారు.

 

ఏపీలో త్వరలో సెంట్రల్ యూనివర్సిటీ: స్మృతిఇరానీ



అనంతరం  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీఇరానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీరామనవమి రోజున రాయలసీమ ప్రాంతంలో ఐఐటీ, ఐఐఈఎస్‌ఆర్, ట్రిపుల్ ఐటీలకు శంకుస్థాపన చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దేశవ్యాప్తంగా విద్యార్థులంతా చదువుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.  ఈ సందర్భంగా స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడులను సన్మానించిన సీఎం బాబు వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారాయణ, గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, సత్యప్రభ, తలారి ఆదిత్య, ఐఐటీ డెరైక్టర్ భాస్కర్‌రాజు, ఐఐఈఎస్‌ఆర్ డెరైక్టర్ గణేష్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.



ఎండవేడిమికి విద్యార్థులు విలవిల



కాగా ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులను తరలించారు. మధ్యాహ్నం సమయం కావడంతో ఎండ వేడిమిని తట్టుకోలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top