అన్నదాతల కలవరం


తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ప్రకటనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండడం అన్నదాతలో గుబులు రేపుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరిపంట కోత, గింజ, చిరుపొట్ట దశలో ఉంది. పల్నాడు ప్రాంతంలో పత్తి పంట పూత, గూడ, పిందె దశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు కురిస్తే పంట నష్టాన్ని

 ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు.

 

మాచర్లటౌన్/నగరం: ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి రైతులను కలవరానికి గురిచేస్తోంది. తుపాను కారణంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, కంది, కూరగాయలు సాగు చేస్తున్న అన్నదాతలు తుపాను భయంతో అంతర్మథనం చెందుతున్నారు. జిల్లాలో వరి 2,52,645 హెక్టార్లలో సాగవుతోంది. ఇందులో వెద పద్ధతిలో 1,32,075 హెక్టార్లు, సాధారణ పద్ధతిలో 63,069 హెక్టార్లు సాగు చేస్తున్నారు. పత్తి 1,98,809 హెక్టార్లు, కంది 20,242 హెక్టార్లలో సాగు చేశారు.



పత్తి పిందెలు రాలే ప్రమాదం..: పత్తి దిగుబడుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీపావళి నుంచి మైల పత్తి దిగుబడులు ప్రారంభమయ్యాయి. పత్తి పంట పూత, గూడ, పిందె దశలో ఉంది. ఈ సమయంలో వర్షం పడితే పత్తిలో పూత, గూడ, పిందెలు రాలిపోతాయి. కొద్దిగా పగిలి ఉన్న కాయలు, కోతకు సిద్ధంగా ఉన్న పత్తి రంగు మారి నాణ్యత లేకుండా పోయే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో సరైన సమయంలో జిల్లా వ్యాప్తంగా ఒకేసారి వర్షాలు కురవకపోవటంతో కందిపంట వివిధ దశల్లో ఉంది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు ఉన్న పంటకు నష్టం లేకున్నా పూతదశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పూత దశలో పచ్చగా ఉన్న పూలపై వాన పడితే వర్షపు నీటి దాటికి పూత రాలుతుంది.



ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు..

 కూరగాయలు, పూలు సాగు చేసుకుంటున్న రైతులు తుపాను హెచ్చరికలతో అంతర్మథనం చెందుతున్నారు. టమాట, దోస, కాకర వంటి పైర్లపై నీరు చేరితే పంట నష్టం అధికంగా ఉంటుంది. కూరగాయల ధరలు ఆకాశానంటుతున్న తరుణంలో వర్షం కురిసి నష్టం జరిగితే ధరలు ఆకాశన్నంటుతాయి. కష్టాలను అధికమించి దిగుబడుల స్థాయికి వస్తే తుపాను గండంతో రైతుల పరిస్థితి క్షణం భయపడుతున్నారు.  

 

నెరవేరని లెవి లక్ష్యం..

వర్షాభావంతో జిల్లాలో కరవు పరిస్థితులు దాపురించాయి. కనీస స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవటంతో ప్రభుత్వం జిల్లాలో 26 కరవు మండలాలను ప్రకటించింది. కరువు ఉందని, లేదని చెబుతున్న మండలాల్లో అనేకచోట్ల రైతులు బోర్ల కింద పంటలను సాగు చేస్తున్నారు. ఆయా పంటలు చీడపీడల దాటిని తట్టుకొని దిగుబడుల దశకు వచ్చాయి. వరిపంట కోత, గింజ, చిరుపొట్ట దశలో ఉంది. భారీగా కాకపోయినా ఓ మోస్తరు వర్షం కురిసినా నోటికాడికి వచ్చిన పంట చేతికందకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వరి విస్తీర్ణం తక్కువ కావటంతో ధాన్యం లెవి లక్ష్యం నెరవేరే అవకాశం లేకుండా పోయింది. వర్షాలు కురిస్తే లెవి లక్ష్యం ఊహకందకుండా పోయే అవకాశం ఉంది. డెల్టాలో వరి పంట ప్రస్తుం ఓదెల రూపంలో ఉంది. అల్పపీడన ప్రభావంగా ఇటీవల కురిసిన వర్షాలకు చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. తర్వాత వారం రోజులు వాతావరణం ఎండగా ఉండటంతో నేలకొరిగిన వరిపంటను రైతులు కోతలు కోయించారు. ఓదెలు రూపంలో ఉన్న సమయంలో వర్షాలు పడితే ధాన్యం మొలకలు రావడంతో పాటు రంగు మారే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top