‘మీ ఇంటికి..’ వచ్చినా ఫలితం లేదు!


 ‘మీ ఇంటికి మీ భూమి’లో రైతులకు ఇవ్వని వన్‌బీ పత్రాలు

  తప్పొప్పులు సవరించని గ్రామ సభలెందుకంటూ రైతుల మండిపాటు

  రెండో విడత ఇంకా అప్‌లోడ్ కాని వైనం

  ప్రత్యేక కార్యక్రమాల్లోనూ తాజా పర్చని రికార్డులు

 విజయనగరం కంటోన్మెంట్:
గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన వర్రి మల్లయ్య.. చనిపోయిన తన తండ్రి పాపునాయుడి పేరిట ఉన్న నాలుగున్నర ఎకరాల భూముల బదులు వన్‌బీలో 2.64 ఎకరాలు మాత్రమే కనిపిస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే  భూములను వారి ఇద్దరి అన్నదమ్ముల పేరున నమోదు చేయాలని పలుమార్లు రెవెన్యూ సిబ్బందికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రెండో విడత ‘మీ ఇంటికి మీ భూమి’ కార్యక్రమంలో మరోసారి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ‘మీ సేవ’కు వెళ్లాలని అధికారులు తాపీగా సూచించారు.



  ఇదే గ్రామానికి చెందిన బర్ల జగన్నాథం, శ్రీరాములు, చంద్రుడు అనే అన్నదమ్ములు వారసత్వ భూములను పంచుకున్నారు. అయితే వారు చెప్పినట్లు కాకుండా రెవెన్యూ అధికారులు తమకు తోచిన విధంగా ప్రతి సర్వే నెంబర్‌నూ మూడు భాగాలు చేసి పట్టా పుస్తకాలు ఇచ్చేశారు. ‘మేం పంచుకున్నదొకలా...మీరు పంచినదొకలా’ఉందని, సమస్య పరిష్కరించాలని వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇదీ జరగలేదు.



 గ్రామ రెవెన్యూ అధికారి అంటే ఆ గ్రామంలోని భూ రికార్డులను ఏటా తాజా పర్చడం, కొత్తగా వచ్చిన విధానాలకు రైతుల రికార్డులు అన్వయించడం చేయాలి. ప్రస్తుతం ఆన్‌లైన్ చేయడానికి రైతుల వద్ద పేరుకుపోయిన సమస్యలను తీర్చాలి. వీఆర్వో కాకుంటే ఆర్‌ఐ, తహశీల్దార్.. ఇలా మండల రెవెన్యూ అధికారులంతా భూ రికార్డులను తాజా పర్చడానికి కృషి చేయాల్సి ఉంది. కానీ జిల్లాలో దశాబ్దాల నాటి రికార్డులు తప్పొప్పులతో నిండి  ఉన్నాయి. వాటిని అధికారులు ఎప్పుడూ పరిష్కరించే ప్రయత్నం చేయలేదు.



 ‘మీ ఇంటికి..’ తీసుకొచ్చినా..!

 ప్రభుత్వం కొత్తగా ‘మీ ఇంటికి మీ భూమి’ అనే కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా దానికి ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా రైతుల రెవెన్యూపరమైన సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాదే మొదటి విడత ‘మీ ఇంటికి-మీ భూమి’ గ్రామ సభలను నిర్వహించింది. ముందుగా రైతులందరికీ ప్రస్తుతమున్న రికార్డుల పరంగా ప్రింట్లు తీసి ఇస్తాం.. అందులో తప్పొప్పులను గుర్తించి అదే ఫారంలో పొందుపరిచి సంతకం చేసి ఇవ్వాలని, వాటిని ఆన్‌లైన్‌లో సవరించి రెండో విడతలో ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో రైతులంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు ఇన్నాళ్లకు పరిష్కారమవుతున్నాయనుకున్నారు. కానీ ఇదంతా ఒట్టిదేనని కొద్దిరోజులకే తేలిపోయింది. అధికారులు చెప్పిన విధంగానే రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో 1,11,538 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు వాటిని తీసుకువెళ్లిపోయారు. ఇక తమ పని ముగిసినట్టేనని భావించారు.



 మొదటికే దిక్కు లేదు..

 రెండో విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి అధికారులు వచ్చి సరిదిద్దిన వన్‌బీలు ఇస్తారని భావించిన రైతులకు అడియాసే అయింది. ఇప్పటికీ మొదటి విడత సభల్లో దరఖాస్తు చేసుకున్న సమస్యలు పరిష్కారం కాలేదు. ఆన్‌లైన్‌లో కూడా మార్పు చేర్పులు చోటు చేసుకోలేదు. మళ్లీ రెండో విడతలో కూడా దరఖాస్తులే స్వీకరిస్తామన్నారు. దీంతో రైతులు అవాక్కయ్యారు. మొదట వచ్చి వన్‌బీ ఫారాలు ఇచ్చి తప్పొప్పులను సరిదిద్దేందుకు అవకాశం ఇస్తామని చెప్పిన అధికారులు అలా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి నిత్యం రెవెన్యూ అధికారులు చేయాల్సిన విధులు చేయకపోగా ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎందుకని రైతాంగం ప్రశ్నిస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top