విశాఖ మాజీ మేయర్ సుబ్బారావు కన్నుమూత

విశాఖ మాజీ మేయర్ సుబ్బారావు కన్నుమూత - Sakshi


చికిత్స పొందుతూ కన్నుమూసిన విశాఖ మాజీ మేయర్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు డీవీ సుబ్బారావు

 

విశాఖపట్నం: ప్రముఖ న్యాయవాది, విశాఖపట్నం నగర మాజీ మేయర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు దుర్వాసుల వెంకట సుబ్బారావు (డీవీ) (83) శనివారం ఇక్కడ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో రెండు రోజులుగా నగరంలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. డీవీ భౌతికకాయాన్ని కిర్లంపూడి లే అవుట్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. సుబ్బారావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అధికార లాంఛనాలతో కాన్వెంట్ జంక్షన్ వద్దనున్న హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.



డీవీ 1932 ఏప్రిల్ 24న పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురంలో జన్మించారు. 1956లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ న్యాయ కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేశారు. 1957 అక్టోబర్ 21న న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ డీవీ నరసరాజు దగ్గర మెళకువలు నేర్చుకున్నారు. అకుంఠిత దీక్ష, వృత్తిపట్ల అంకితభావం అనతికాలంలోనే ఆయన్ని అత్యున్నత స్థాయికి చేర్చాయి. దేశంలోని ప్రముఖ కంపెనీలకు న్యాయ సలహాదారుగా పనిచేశారు. ప్రభుత్వ న్యాయవాదిగా మన్ననలు పొందారు. 2000 - 2004 మధ్య దేశంలో అత్యున్నతమైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్‌గా విశేష సేవలందించారు.



న్యాయశాస్త్రంలో ఆయనకున్న పరిజ్ఞానం, వాదనా పటిమను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా అనేకమంది న్యాయ నిపుణులు ప్రశంసించారు. సుబ్బారావు 1985-87 మధ్య విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) అధ్యక్షునిగా, 1987-92 మధ్య నగర మేయర్‌గా పనిచేశారు. విశాఖలో లయన్స్ క్లబ్, లయన్స్ కేన్సర్ ఆస్పత్రి, శంకర్ నేత్రాలయం, కళాభారతి, పౌర గ్రంథాలయం, ఏవీఎన్ కళాశాల, విశాఖ వేలీ స్కూల్, గాయత్రీ విద్యా పరిషత్ వంటి ఎన్నో సంస్థలకు అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షునిగా ఉన్నారు. గతంలో భారత క్రికెట్ జట్టు మేనేజర్‌గా  పనిచేశారు. కాగా, డీవీ సుబ్బారావు మృతి కి ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు సంతాపం ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top