శంకరరావును చంపేశారు!

శంకరరావును చంపేశారు! - Sakshi


►నరహంతకుడు మెట్ట శంకరరావు దారుణహత్య

►వంశధార నదిలో మృతదేహం వెలికితీత

►ఊపిరి పీల్చుకున‍్న మెట‍్టపేట వాసులు


జలుమూరు, ఎల్‌.ఎన్‌.పేట: ఏడున్నరేళ్ల క్రితం ఏడుగురిని హత్య చేసిన కేసులో నిందితుడు మెట్ట శంకరరావు శుక్రవారం హతమయ్యాడు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అతనిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు... కారులో తీసుకెళ్లి హత్య చేశారు. మృతదేహాన్ని జలుమూరు మండలం పరిధిలో వంశధార నది ఇసుకలో పూడ్చేశారు. సాయంత్రం పోలీసులు కనుక్కొని, మృతుడు శంకరరావుగా గుర్తించారు. జలుమూరు మండలంలోని మెట్టపేటకు చెందిన అతను 2010, నవంబర్‌ 30న రాత్రి స్వగ్రామంలో ఐదుగురు గ్రామస్థులతో పాటు తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే.



శంకరరావు సీఆర్‌పీఎఫ్‌లో జవానుగా పనిచేసేవాడు. 2005లో అతని భార్య హత్యకు గురయ్యింది. ఈ కేసులో అతనికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఉద్యోగం కూడా పోయింది. దీంతో సాక్ష్యం చెప్పిన వారిపై కక్ష పెంచుకున్నాడు. మరోవైపు ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశాడు. అయితే సాక్ష్యులు మరోసారి హైకోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే తనకు ఉరిశిక్ష పడుతుందనే భయంతో వారిపై దాడికి పథక రచన చేశాడు. 2010, నవంబరులో శంకరరావు బెయిల్‌పై విడుదలయ్యాడు.


అదే నెల 30వ తేదీ రాత్రి తన ఇంటిలో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు మహేశ్‌ (9), మానస (6)లతోపాటు మరో అయిదుగురి చంపేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే శంకరరావు దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ తగిన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయింది. మానసిక పరివర్తన కోసం ఏడాది పాటు విశాఖపట్నంలోని రామకృష్ణ ఆశ్రమంలో ఉంచాలని శ్రీకాకుళం ఎస్పీని కోర్టు ఆదేశించింది. దీంతో ఇన్నాళ్లూ ఆశ్రమంలో ఉన‍్న శంకరరావు కొద్ది నెలల క్రితం పుట‍్టపర్తి వెళ్లిపోయారు.



అక‍్కడ నుంచి నాలుగు నెలల క్రితమే విజయనగరం జిల్లా బొబ్బిలికి వచ్చాడు. కోస్టల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరాడు. కంపెనీకి అర కిలోమీటరు దూరంలో ఉన్న మెట్టవలసలో తోటి ఉద్యోగితో కలిసి ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం విధులకు నడిచి వెళ్తుండగా ఒక వ్యక్తి పదునైన ఆయుధంతో శంకరరావు తలపై కొట్టాడు. దీంతో అతను స్పృహ తప్పి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అదే సమయంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ వాహనంలోకి ఎక్కించుకొని తీసుకెళ్లారు. తర్వాత హత్య చేసి మృతదేహాన్ని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వంశధార నది వద్దకు తీసుకొచ్చారు.



అక్కడ తుప్పల మధ్య ఇసుకలో పూడ్చేశారు. దీన్ని సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న ఎల్‌ఎన్‌ పేట మండలం దబ్బపాడు గ్రామస్థులు గమనించారు. గుర్తు తెలియని మృతదేహం ఉందనే సమాచారంతో సరుబుజ్జిలి పీఎస్‌ పోలీసులు సాయంత్రం వంశధార నదిలో గాలించారు. మృతుడు మెట్ట శంకరరావుగా గుర్తించారు. బొబ్బిలి, సరుబుజ్జిలి ఎస్సైలు ఎస్‌.అమ్మినాయుడు, బి.అశోక్‌బాబు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావు నాయుడు, ఆమదాలవలస సర్కిల్‌ ఇన్‌స్పెక‍్టర్‌ డి.నవీన్‌కుమార్‌లు శుక్రవారం రాత్రి పరిశీలించారు. మృతదేహాన్ని శనివారం ఉదయం వరకు సంఘటన స్థలంలోనే ఉంచుతామని పోలీసులు తెలిపారు.



నేనే హత‍్య చేశాను!

శంకరరావును తానే హత‍్య చేశానని మెట్టపేటకు చెందిన ఊట ప్రకాశరావు పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు ఇంకా దీన్ని నిర్థారించలేదు.



ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

గత 12 సంవత‍్సరాలు కంటి మీద కునుకు లేకుండా ఉన్న మెట‍్టపేట గ్రామస్తులు శంకరరావు హత్యకు గురైనట్టు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. గ్రామానికి చెందిన ఏడుగురి హత్య చేసిన రాక్షసుడు ఇక లేడని ఇక మాకు భయమేలేదని వారు చెబుతున్నారు. అన్ని వైపుల నుంచి చావు నుంచి తప్పించుకొన్నా చివరకు వాడు కూడా అదే విధంగా చనిపోవడంతో నరకాసురుడు వధ జరిగిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలుమూరు ఎస్‌ఐ ఎం. గోవింద సమాచారం తెలుసుకొని మెట్టపేట సందర్శించాడు. మృత దేహాం సరుబుజ్జిలి పరిధి కావడంతో సరుబుజ్జిలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top