అటవీ భూములన్నీ ఆక్రమణలోనే


  •    నూజివీడు డివిజన్లో 31,686 ఎకరాలు

  •   ప్రభుత్వ భూముల వివరాలన్నీ సేకరణ

  •   వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోండి

  •   సబ్‌కలెక్టర్ చక్రధర్‌బాబు

  • నూజివీడు : నూజివీడు డివిజన్లో 31,686ఎకరాల ప్రభుత్వ, అటవీభూములున్నాయని, వాటిలో దాదాపు 26వేల ఎకరాలున్న అటవీ భూములన్నీ ఆక్రమణలోనే ఉన్నాయని నూజివీడు సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో సోమవారం  మాట్లాడుతూ డివిజన్లో ఉన్న అన్నిశాఖల ప్రభుత్వ  భూముల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రతి రోజూ ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షిస్తున్నానన్నారు.



    ఇరిగేషన్‌కు చెందిన చెరువులు, వాగులు  ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తుందని, మొత్తం వివరాలు సేకరించిన తరువాత ఆ ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో తగినంతమంది  సిబ్బంది లేకపోవడం వల్లనే అటవీభూములు , ఇరిగేషన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారని తెలిపారు. అలాగే గ్రామాలలో, పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ఆ భూముల్లో ఏమైనా ఆక్రమణలుంటే వాటినీ తొలగిస్తామన్నారు.



    ప్రభుత్వభూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు గానూ గ్రామస్థాయిలో వీఆర్వోతో పాటు ఆ మండల అధికారులతో కమిటీలు వేశామన్నారు. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, రెడ్డిగూడెం, బాపులపాడు  మండలాల్లో అటవీభూములు ఎక్కువగా ఉన్నాయని, ఇవన్నీ దాదాపు ఆక్రమణకు గురవ్వడమే కాకుండా పండ్లతోటలు  పెంచుతున్నారని చెప్పారు.  డివిజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్ల పెండింగ్ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని  సబ్‌కలెక్టర్ వివరించారు.. ఈ పెండింగ్‌ను తగ్గించేందుకు చర్యలు చేపట్టానన్నారు.



    డివిజన్‌లో మీసేవా కేంద్రాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మీ సేవా కేంద్రాల వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని, ఆ పట్టికలో పేర్కొన్న ఫీజును మాత్రమే ప్రజలు చెల్లించాలన్నారు. అలాగే  ఆధార్‌కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, గతంలో ఆధార్‌కార్డు తీసుకుని అందులో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేయించుకోవడానికి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

     

    వ్యాధులు నివారించండి...

     

    వర్షాకాలం వచ్చినందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల అధికారులు వ్యాధుల నివారణా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీల్లో పూడికను తొలగించడం, మంచినీటి ట్యాంకుల క్లీనింగ్, నీటిని క్లోరినేషన్ చేయడం, నివేశన ప్రాంతాల్లో, ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top