సాగరతీరాన... పల్లవించిన స్నేహగీతిక

సాగరతీరాన... పల్లవించిన స్నేహగీతిక - Sakshi


ఘనంగా ఐఎఫ్‌ఆర్-2016 ముగింపు వేడుకలు.. నేడు విదేశీ యుద్ధ నౌకలకు వీడ్కోలు కార్యక్రమం

 

 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘బ్రిడ్జ్ త్రూ ఓషన్స్’ అనే అంతర్జాతీయ నౌకాదళ స్ఫూర్తి గీతం వీనులువిందుగా వినిపిస్తుండగా... దేశ, విదేశీ నౌకాదళాల సంయుక్త సంగీత విభావరి మంత్ర ముగ్ధులను చేస్తుండగా... పరస్పర అభివాదాలతో స్నేహ సౌరభాలు గుబాళిస్తుండగా విశాఖలో అంతర్జాతీయ నౌకాదళాల సమీక్ష(ఐఎఫ్‌ఆర్-2016) ఘనంగా ముగిసింది. ఈ నెల 4న ప్రారంభమైన ఐఎఫ్‌ఆర్ వేడుకలు సోమవారం ముగిశాయి. చివరిరోజు విశాఖ నేవల్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్కే ధోవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో అంతర్జాతీయ నౌకాదళాల సంయుక్త సంగీత విభావరి నిర్వహించారు.



ఆయా దేశాల సంప్రదాయ గీతాలు, నృత్యాలతో నేవల్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణం హోరెత్తింది. ఏయూలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్‌లో సోమవారం రాత్రి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పండిట్ రమేష్ చౌరాసియా వేణుగానం సందర్శకులను మైమరిపించింది. ఐఎఫ్‌ఆర్ ముగింపు సంప్రదాయాల్లో భాగంగా నౌకాదళ సాహసస్ఫూర్తికి ప్రతీకగా ‘సెయిల్ ఇన్ కంపెనీ’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు.    



 విదేశీ యుద్ధనౌకలకు నేడు వీడ్కోలు

 ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న విదేశీ యుద్ధనౌకలకు భారత నౌకాదళం మంగళవారం వీడ్కోలు పలకనుంది.  విదేశీ నౌకలను అంతర్జాతీయ సముద్ర జలాల వరకు సాదరంగా సాగనంపడం నౌకాదళ సంప్రదాయం. అందుకు అనుగుణంగా 27 విదేశీ నౌకలను రెండు బృందాలుగా చేసి సాదర వీడ్కోలు పలుకుతారు. మొదటి బృందానికి భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య మీద పయనిస్తూ రియర్ అడ్మిరల్ రణ్‌వీర్ సింగ్ నేతృత్వంలో వీడ్కోలు పలుకుతారు. రెండో బృందానికి ఐఎన్‌ఎస్ విరాట్ మీద పయనిస్తూ రియర్ అడ్మిరల్ ఎస్‌వీ భోకరే నేతృత్వంలో వీడ్కోలు చెబుతారు. ఈ సందర్భంగా పలు విన్యాసాలు   నిర్వహిస్తారు. విదేశీ యుద్ధ నౌకలను సాగనంపిన అనంతరం భారత యుద్ధ నౌకలు తిరిగివస్తాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top