అయ్యో.. ఏం జరిగిందో?


 శనివారం రాత్రి వారంతా సాంబారు, వంకాయ-బఠానీ కూరతో అన్నం తిని పడుకున్నారు. ఏమైందో ఏమో గానీ ఆదివారం ఉదయానికి వారిలో చాలామంది తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో లుంగలు చుట్టుకుపోవడం ప్రారంభించారు. అంతే ఆ హాస్టల్ ఆవరణ రోదనలు.. హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఇలా 72 మంది అస్వస్థతకు గురి కావడంతో వారందరినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

 

 టెక్కలి:పాత జాతీయ రహదారికి ఆనుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల వసతి గృహంలో శనివారం అర్ధరాత్రి నుంచి కలకలం మొదలైంది. ఒక్కో విద్యార్థిని కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో బాధపడసాగారు. వారికి అందుబాటులో ఉన్న మందులు ఇచ్చినప్పటికీ ఆదివారం ఉదయానికి పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఇక లాభం లేదనుకున్న సిబ్బంది అస్వస్థతకు గురైనావారిని ఆటోల్లో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మొదట 30 మంది అనారోగ్యానికి గురి కాగా చివరికి ఆ సంఖ్య 72కు చేరుకుంది. ఒక్కసారిగా అంతమందిని తరలించడంతో ఆస్పత్రిలో గందరగోళం ఏర్పడింది. ఒకవైపు సిబ్బంది చికిత్స చేస్తుండగానే.. మరో వైపు బాధ భరించలేక విద్యార్థినులు భోరున విలపిస్తూ కుప్పకూలిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న 52 మంది విద్యార్థినులను మధ్యాహ్నం హాస్టల్‌కు పంపేశారు. మిగిలిన 20 మందికి ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.

 

 సరిపోని సౌకర్యాలు

 ఒక్కసారి 72 మందికి చికిత్స చేయాల్సి రావడంతో ఆస్పత్రిలో సౌకర్యాలు, సిబ్బంది సరిపోలేదు. దాంతో వైద్యాధికారులకు సమాచారం అందజేశారు. మంచాలు చాలకపోవడంతో ఒక్కో మంచంపై ముగ్గురు విద్యార్థినులు సర్దుకోవాల్సి వచ్చింది. కాగా ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఓ విద్యార్థిని తల్లి నేలపై కూలబడి భోరున విలపించింది. స్థానిక తహశీల్దార్ అప్పలరాజు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినుల పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించాలని డీసీహెచ్‌ఎస్ సునీలతో పాటు వైద్య సిబ్బందిని ఆదేశించారు. వసతి గృహ ప్రాంగణంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం వసతి గృహాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు.

 

 కారణమేమిటో?

 విద్యార్ధినులు అస్వస్థతకు గురి కావడానికి కారణమేమిటన్నది స్పష్టంగా తెలియడం లేదు. కలుషిత ఆహారం కారణం కావచ్చని ఆస్పత్రి వైద్యులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ అవకాశం లేదని హాస్టల్ వార్డెన్ రాయకన్న అంటున్నారు. హాస్టల్లో 419 మంది విద్యార్థులు ఉన్నారని, అందరికీ రాత్రి ఒకే రకం భోజనం పెట్టామని.. వారిలో 72 మందే అస్వస్థతకు గురయ్యారని.. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

 మంత్రి అచ్చెన్న పరామర్శ

 పెద్దసంఖ్యలో విద్యార్థినుల అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. కారణాలపై ఆరా తీశారు. అవసరమైతే బాధితులను రిమ్స్‌కు తరలించాలని ఆదేశించారు. అలాగే వసతిగృహంలో నీటి నమూనాలను పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. అనంతరం వసతి గృహాన్ని సందర్శించి ప్రిన్సిపాల్, ఏఎన్‌ఎమ్, వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధులని తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎంపీపీ మట్ట సుందరమ్మ, సర్పంచ్ బెహరా కృష్ణవేణి, వైస్ ఎంపీపీ హనుమంతు రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top